Delay in grain commission | కరీంనగర్ కలెక్టరేట్, మే 22 : సెర్ఫ్ ఆధ్వర్యంలో జిల్లాలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కమీషన్ విడుదలలో జరిగిన జాప్యంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. పౌరసరఫరాల శాఖ నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి బ్యాంకు ఖాతాలో జమకాగానే, ఆమొత్తాన్ని గ్రామైక్య సంఘాల ఖాతాల్లోకి మళ్ళించాల్సి ఉండగా, రెండున్నర నెలలకు పైగా సంబంధిత అధికారి ఖాతాలోనే ఉంచటం, అడిగిన వారికి సంబంధిత అధికారులు పొంతనలేని సమాధానాలు చెబుతుండటం మరింత ఊతమిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
2023-24 వానాకాలం సీజన్‌కు సంబంధించిన కమీషన్ రూ.1,05,08,999 పైచిలుకు రావాల్సి ఉండగా, ఇందులో 70శాతం కమీషన్ రూ.73.56 లక్షలు ఈ ఏడాది ఫిబ్రవరి 7న పౌరసరఫరాల శాఖ సంబంధిత అధికారి ఖాతాలో జమచేసింది. అలాగే, 2022-23 యాసంగి సీజన్ కు సంబంధించిన కమీషన్ రూ.1,38,33,000 కూడా ఈ ఏడాది ఫిబ్రవరి 8న రూ.96.83 లక్షలు, ఏప్రిల్ 4న రూ.41.50లక్షలు రెండు దఫాలుగా జమచేసినట్లు తెలుస్తోంది. ఈమొత్తాన్ని డిఆర్‌డిఎకు చెందిన మార్కెటింగ్ విభాగం ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించిన వివోఏల బ్యాంకు ఖాతాల్లో జమచేయాల్సి ఉండగా, గత నెల 26న జమచేసినట్లు సమాచారం.
పౌరసరఫరాల శాఖ నుంచి విడుదలైన రెండున్నర నెలల అనంతరం వివోఏలకు జమ చేసినట్లు ఇటీవల అధికారులకు పంపిన నివేదికల ద్వారా తెలుస్తోంది. డిఆర్డిఏకు అందిన కమీషన్ గ్రామైక్య సంఘాలకు చేరటంలో కలిగిన జాప్యంపై రికన్సిలేషన్ చేయటంలో కలిగిన ఆలస్యమే కారణంగా సంబంధితాధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి సీజన్ వారీగా రికన్సిలేషన్ ఎప్పటికప్పుడు పూర్తయిన అనంతరమే, వివోఏలకు చెల్లించాల్సిన కమీషన్ వివరాలు సేకరించి, పౌరసరఫరాల శాఖకు అధికారులు అందజేస్తారని తెలుస్తోంది. వాటి ప్రకారమే కేంద్రాలకు అందజేసే గన్నీ సంచుల వివరాలు, తిరిగి పౌరసరఫరాల శాఖకు పంపిన వివరాలు సరిపోల్చుకుని, తక్కువ ఎక్కువ ఉంటే ఆమేరకు కమీషన్లో మినహాయించుకుని మిగతా మొత్తం విడుదల చేస్తారని పౌరసరఫరాల శాఖ సిబ్బంది వెల్లడిస్తున్నారు.
అధికారులు చుట్టు తిరుగుతున్నా.. ఫలితం శూన్యం..
గత నాలుగు సీజన్ల మంచి కమీషన్ రాకపోవటంతో కేంద్రాల నిర్వాహకులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా కనీస పట్టింపులేకుండా వ్యవహరించిన సంబంధిత సిబ్బంది. ఈ ఏడాది మార్చి చివరి వారంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ళపై డిఆర్డిఏ అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో కమీషన్ల విడుదలపై కలెక్టర్ ప్రశ్నించినట్లు తెల్సింది. దీంతో, ఉలిక్కిపడ్డ సదరు సిబ్బంది రెండు రోజుల్లో విడుదల చేస్తామంటూ సమాధానం చెప్పి. నెలరోజులు గడిచిన అనంతరం జమ చేసి చేతులు దులుపుకున్నట్లు సమాచారం. కేంద్రాల నిర్వాహకులకు చెల్లించాల్సిన కమీషన్ వారి ఖాతాల్లో జమ చేసే సందర్భంలో వారికి చెల్లించాల్సిన మొత్తం కమీషన్ ఎంత, ప్రస్తుతం ఏసీజన్కు సంబంధించినది చెల్లిస్తున్నారు.
ఎంత మొత్తం వారి ఖాతాల్లో జమచేశారు, ఇంకెంత జమ చేయాల్సి ఉన్నదనే వివరాలు లిఖితపూర్వకంగా డిఆర్డివో ద్వారా గ్రామైక్య సంఘాలకు, సీసీలు, ఏపిఎంలకు వెల్లడించాల్సి ఉంటుంది. అలా కానిపక్షంలో ఆయా విభాగాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాట్సప్ గ్రూపుల ద్వారానైనా తెలియజేయాల్సి ఉంటుంది. అయితే, ఇదేమి లేకుండా మార్కెటింగ్ సిబ్బంది వివోఏలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా ఖాతాల్లో జమ చేసినట్లు కార్యాలయవర్గాలు చర్చించుకుంటున్నాయి.
తమకు రావాల్సిన కమీషన్ ఎంత, ప్రస్తుతం ఎంత వచ్చింది అనే క్లారిటీ కూడా లేకపోవటంతో అయోమయానికి గురవుతున్నట్లు కొంతమంది వివోఏల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కమీషన్ పంపిణీలో జరుగుతున్న జాప్యంపై పత్రికల్లో వార్తలు వచ్చిన అనంతరం సంబంధిత సిబ్బంది ఏయే వివోఏకు ఎంత కమీషన్ రావాల్సి ఉంది. ప్రస్తుతం వారి ఖాతాల్లో ఎంత జమైంది? ఇంకెంత చెల్లించాల్సి ఉంది అనే వివరాలు మండలాల వారీగా సేకరించి అందజేయాలంటూ, మార్కెటింగ్ విభాగం నిర్వహిస్తున్న వాట్సప్ గ్రూప్ ద్వారా సీసీలు, ఏపిఎంలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
వివోఏలకు చెల్లిస్తున్న కమీషన్ నుంచి పదిశాతం వరకు మినహాయించి జిల్లా సమాఖ్యలో జమ చేస్తున్నట్లు తెలుస్తుండగా, అంతమొత్తం జమచేయటం వెనుక అంతర్యమేంటనే ప్రశ్న ఉద్భవిస్తోంది. జిల్లా సమాఖ్య మనుగడకు ఎంతమొత్తం జమచేయాల్సి ఉంటుందనే నిబంధనలపై కూడా అధికారుల నుంచి సరైన సమాధానం లేదు. ధాన్యం కమీషన్ ఒక్కో సీజన్‌కు రూ.కోటి దాకా వస్తుండగా, ఏటా రెండు సీజన్లకు కలిపి రెండు కోట్ల వరకు వస్తే, అందులో పదిశాతం రూ.20లక్షల వరకు జమచేస్తుండగా, గత కొన్నేళ్ళుగా ఏటా జమవుతున్న ఈమొత్తం ఏమవుతున్నదనేది ప్రశ్నార్ధకమే. రెండున్నర నెలలకు పైగా తమ ఖాతాల్లో భద్రంగా దాచిన ధాన్యం కమీషన్‌పై వచ్చిన వడ్డీ వివోఏలకు చెల్లించాల్సిన కమీషన్‌తో కలిపి చెల్లించారా? లేక వారి ఖాతాల్లోనే ఉందా? ఉంటే ఆమొత్తం దేనికి వినియోగిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.