వేములవాడ, ఏప్రిల్ 14: వేములవాడ రాజన్నకు భక్తులు సమర్పించే తలనీలాల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్ గడువు ముగియడంతో ఆలయ అధికారులే సిబ్బంది ద్వారా భద్రపరుస్తుండగా, సీసీ కెమెరాల ఏర్పాటు సరిగా లేకపోవడం, ప్రత్యేక సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండకపోవడం భద్రత లోపాలను ఎత్తిచూపుతున్నాయి. అకడే పర్యవేక్షించాల్సిన భద్రతా సిబ్బంది కూడా కనిపించకపోవడం అక్రమాలకు తెరలేపే అవకాశం ఉందని భక్తులు ఆరోపిస్తున్నారు. అందులో అత్యంత విలువైన తలనీలాలను భద్రపరిచే విధానంలో లోపభూయిష్టమైన విధివిధానాలు ఉన్నాయని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి.
స్వామివారికి తలనీలాల సమర్పణ, హుండీ కానుకలతో సమానం కావడం అందుకు అనుమానాలకు తావిస్తున్నది. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా టికెట్లు కేటాయించినప్పుడే విలువైన తలనీలాలు భద్రపరిచే అంశంలో స్పష్టత వస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మహిళలు సమర్పిస్తున్న తలనీలాలు వేలాది రూపాయల విలువ చేయడంతో భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ ఉన్నది. సిబ్బందిని మాత్రమే కేటాయించి అధికారులు చేతులు దులుపుకొన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. రద్దీగా ఉండే సమయంలో భద్రతను పెంచి మహిళలు, పురుషులు వేర్వేరుగా టికెట్లు కేటాయించి వచ్చిన వాటిని పకడ్బందీగా భద్రపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు కోరుతున్నారు.
తలనీలాలకు సంబంధించి ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నాం. ఎనిమిది మంది సిబ్బందిని కేటాయించి అదనంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాలను సెల్ఫోన్లకు అనుసంధానం చేసుకొని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. ఇకపై మహిళలకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం. తలనీలాలు దుర్వినియోగం అయినట్లయితే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– వినోద్‌రెడ్డి, ఈవో రాజన్న ఆలయం (వేములవాడ)