“జగిత్యాల నియోజకవర్గంలోని ఒక మండల తహసీల్ కార్యాలయం అది. ప్రజా సంబంధాలు నిర్వహించే వృత్తిలో ఉన్న ఒక వ్యక్తి తన స్నేహితుడి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం అక్కడికి వెళ్లాడు. తాము స్లాట్ బుక్ చేసుకున్నామని, రిజిస్ట్రేషన్ ఉందని అధికారికి చెప్పాడు. దీంతో అతడు ఆపరేటర్‌ను పిలిచి రిజిస్ట్రేషన్ వ్యవహారం చూడాలని సూచించగా, సదరు ఆపరేటర్ అన్ని పత్రాలు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేయరాదని తేల్చి చెప్పాడు. అన్ని రికార్డులు ఉన్నాయి.. అమ్మినవారు, కొన్నవారు ఇద్దరూ ఉన్నారు.. ఎందుకు రిజిస్ట్రేషన్ చేయరాదు.. అని ప్రశ్నిస్తే.. లింక్ డాక్యుమెంట్ లేదు.. అని బదులిచ్చాడు. అదేంటి రెండు లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి కదా..! ఎందుకు చేయరాదు.. అంటే.. భూమిని ఇప్పటి వరకు ఎనిమిది మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.. విక్రయించారు.. మీ వద్ద మూడు లింక్ డాక్యుమెంట్లు మాత్రమే ఉన్నాయి.. అంతకు ముందటి నాలుగు లింక్ డాక్యుమెంట్లు తెస్తేనే రిజిస్ట్రేషన్ కుదురుతుందని తేల్చిచెప్పాడు.. దీంతో ఆపరేటర్ సమాధానం విన్న ప్రజా సంబంధాలు నిర్వహించే వృత్తిలో ఉన్న వ్యక్తి ఆశ్చర్యపోయాడు. చివరకు ఆపరేటర్‌ను ప్రైవేట్‌గా వెళ్లి కలిస్తే.. అందరికీ రూ.30వేలు తీసుకుంటాం అన్నా.. మీరు ప్రజా సంబంధ వృత్తిలో ఉన్నారు కదా.. రూ.15వేలు ఇవ్వండి అని చెప్పడంతో అతను అడిగినన్ని డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకొని బతుకుజీవుడా.. అని బయటపడ్డారు.”
“చొప్పదండి నియోజకవర్గంలోని ఓ మండల తహసీల్దార్ ఆపరేటర్ వ్యవహారం మరింత వివాదస్పదంగా మారింది.. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వ్యక్తి భూ రికార్డులు సరిగానే ఉన్నా.. లేవని చెప్పాడు. రూ.30వేలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ జరుగుతుందని ఆపరేటర్ తేల్చిచెప్పడంతో గత్యంతరం లేని పరిస్థితిలో అడిగిన డబ్బులు ఇచ్చి భూ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు.. అయితే, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సదరు బాధితుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.. ఇవి మచ్చుకు ఒకటి, రెండు మాత్రమే. ఇలాంటివి వందల్లో ఉన్నాయి అంటున్నారు బాధితులు.
రెవెన్యూ శాఖలో విస్తరించిన అవినీతి, దళారుల వ్యవస్థను తొలిగించి లంచగొండి తనం లేని వ్యవస్థను సృష్టించాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సదుద్దేశంతో ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చారు. అంతే కాకుండా భూ రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా, సులభంగా, వేగంగా అయ్యేలా విజయవంతంగా అమలు చేశారు. అయితే, కొందరు ఆపరేటర్లు చేతివాటం ప్రదర్శిస్తూ.. అందినకాడికి దండుకుంటూ ధరణి వ్యవస్థకే మాయని మచ్చ తెస్తునారు. జగిత్యాల జిల్లాలోని పలు మండలాలకు చెందిన పలువురు ఆపరేటర్ల లంచాలు, వారి దోపిడీ చర్చనీయాంశంగా మారిపోయింది. ఒకటి కాదు.. రెండు కాదు నిత్యం వారిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
– జగిత్యాల రూరల్, జూలై 14
వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లన్నీ తహసీల్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రిజిస్ట్రేషన్లు వేగంగా, పారదర్శకంగా చేయడం, వెంటనే మ్యుటేషన్ చేయాలన్న సంకల్పంతో తహసీల్దార్లకు ఈ బాధ్యతలను అప్పగించారు. ఈ ప్రక్రియ నిర్వహించేది తహసీల్దార్లే అయినా.. వాస్తవికంగా అన్ని కార్యక్రమాలు ఆపరేటర్లే చేయాల్సిన పరిస్థితి. ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాత ప్రతి తహసీల్ కార్యాలయంలో ధరణి కంప్యూటర్ ఆపరేటర్లను రూ.8వేల వేతనంతో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించారు.
భూమి రిజిస్ట్రేషన్, విరాసత్, పార్టీషన్, తదితర వాటి కోసం ముందుగా మీ సేవలో స్లాట్ బుక్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ డేట్ ఇస్తారు. ఎవరెవరికి స్లాట్ బుక్ అయ్యిందన్న వివరాలు ధరణి ఆపరేటర్లకే తెలుస్తాయి. రిజిస్ట్రేషన్ కోసం సమయం పొందిన వ్యక్తులు తహసీల్ ఆఫీస్‌కు వెళ్లి ముందుగా రిజిస్ట్రేషన్ వ్యవహారం, స్లాట్ బుకింగ్ అంశాన్ని ధరణి ఆపరేటర్లతో ప్రస్తావించాల్సి ఉంటుంది. స్లాట్ ఓకే అయిందని తెలుసుకున్న తర్వాత తహసీల్దార్లను కలిసి పత్రాలన్నింటినీ చూపించాలి. అధికారి ఆమోదం తర్వాత ఆపరేటర్లకు ఇచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను తహసీల్దార్ పూర్తి చేస్తారు. తర్వాత మ్యుటేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం పత్రాలను కొనుగోలు, విక్రయదారులకు అందిస్తారు. అయితే, ఈ వ్యవహారంలో ఆపరేటర్లదే కీలక పాత్ర. స్లాట్ ఓకే అయిందా? లేదా? అన్నప్పటి నుంచే ఆపరేటర్లు తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. వీలైనంత వరకు స్లాట్ బుకింగ్ కాలేదని బెదిరిస్తున్నారు. ఎందుకు కాలేదు.. అంటే.. రికార్డులు సరిగా లేవని చెబుతున్నారు. రికార్డులన్నీ సరి చేసి రిజిస్ట్రేషన్ చేయాలంటే ఖర్చవుతుందని బెదిరిస్తున్నారు. విధి లేని పరిస్థితుల్లో చాలా మంది ఆపరేటర్ల ధన దాహానికి బలి అవుతున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా మ్యుటేషన్ పేపర్లు రావడం లేదని, మూడు నాలుగు రోజుల తర్వాత వచ్చి తీసుకుపోవాలంటూ కొర్రీలు పెడుతున్నారు. వారు సంపాదించడంతోపాటు ఆధికారులందరికీ ఇవ్వాల్సి ఉంటుంది అంటూ వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు.
ఆపరేటర్ల ఆగడాలు శ్రుతిమించడంతో అటు బాధితులు, ఇటు ప్రజాప్రతినిధులు వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. జగిత్యాల నియోజకవర్గంలోని ఒక మండలంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఇటీవలే పార్టీ మారిన ఒక ప్రజాప్రతినిధికి దగ్గరి బంధువు కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు సమాచారం. సదరు ఆపరేటర్ మూడేండ్ల వ్యవధిలో రూ.కోట్లు సంపాదించాడనే ఆరోపణలున్నాయి. ప్రజాప్రతినిధి బంధువు అన్న ధీమాతో ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోపాటు, కార్యాలయాన్ని అసాంఘిక కార్యకలాపాలకు సైతం వేదికగా మార్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఒకటి రెండుసార్లు అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రయత్నించగా సదరు ఆపరేటర్ ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి విషయం చెప్పగా, “మా బావ కొడుకుపై మీరెలా ఫిర్యాదు చేస్తారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
దీంతో వారు సైతం కిక్కురుమనకుండా ఉన్నట్లు తెలుస్తోంది. చొప్పదండి నియోజకవర్గంలోని ఆపరేటర్‌పై లంచాలతోపాటు ఇతర అనేక ఆరోపణలు వచ్చాయి. విధిలేని పరిస్థితుల్లో సదరు ఆపరేటర్‌ను మరో చోటికి మార్చారు. కోరుట్ల నియోజకవర్గంలోని మరో ఆపరేటర్ వ్యవహారశైలి సైతం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కాగా, నాలుగు రోజుల క్రితం ఓ తహసీల్దార్ ధైర్యం చేసి ఆపరేటర్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, సదరు ఆపరేటర్‌ను జిల్లా కేంద్రానికి తాత్కాలికంగా అటాచ్డ్ చేసినట్లు సమాచారం.
ఆపరేటర్లకు సంబంధించిన వ్యవహారం మొత్తంలో జగిత్యాలలోని ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగే కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం ప్రతి మండలానికి ఒక ఆపరేటర్, జిల్లా కేంద్రానికి ఒక కో ఆర్డినేటర్‌ను నియమించారు. అలాగే, జిల్లా కేంద్రంలో ఒక ఆపరేటర్‌ను బఫర్ ఆపరేటర్‌గా ఏర్పాటు చేశారు. ఈ వ్యక్తి ఎవరైనా మండల ఆపరేటర్‌కు వ్యక్తిగత ఇబ్బంది, సెలవు, అనారోగ్యం ఉన్న సమయంలో ఆ మండలానికి వెళ్లి డ్యూటీ నిర్వహించాల్సి ఉంటుంది. కాగా, ఆపరేటర్లను కో-ఆర్డినేట్ చేసేందుకు జిల్లా కోఆర్డినేటర్ ఉన్నప్పటికీ అతడిని పక్కకు నెట్టి మరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. జిల్లాలోని ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో కంప్యూటర్ హార్డ్‌వేర్ చూసేందుకు నియమించిన ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి డిప్యుటేషన్ పేరుతో జిల్లా కేంద్రంలో తిష్టవేసినట్లు సమాచారం. అంతే కాదు, పెద్ద తిమింగళంలా మారి ఆపరేటర్లపై అధికారం చెలాయించడంతోపాటు మండలాల నుంచి వచ్చే రెవెన్యూ వ్యవహారాలను సైతం చక్కబెట్టి పెద్దఎత్తున సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో ఉన్నతాధికారులకు సైతం వాటా ఉన్నట్టు జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులే చర్చించుకోవడం విశేషం. సదరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ధరణి ఆపరేటర్ల విభాగానికి వాస్తవికంగా సంబంధం లేదు. ధరణికి సంబంధించిన వివరాలు అన్నీ ధరణి జిల్లా కో-ఆర్డినేటర్ నిర్వహించాలి. ఉన్నతాధికారి వద్దకు వెళ్లి ఆయన వేలిముద్ర తీసుకోవడంతోపాటు, ధరణి వివరాలు తెలియజేయాలి. అయితే జిల్లాలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతున్నట్లు సమాచారం. ధరణి జిల్లా కో-ఆర్డినేటర్‌ను పక్కన పడేసి కంప్యూటర్ హార్డ్‌వేర్‌గా విధులు నిర్వర్తించాల్సిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి కో-ఆర్డినేటర్ బాధ్యతలు అనధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కంప్యూటర్ ఆపరేటర్ అంటూ జిల్లా కీలక అధికారులకు దగ్గర కావడం, వారి ప్రాపకం సంపాదించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఆపరేటర్లపై వచ్చే ఆరోపణలన్నింటినీ ఉన్నతాధికారులు సదరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి చెబుతుండడం, దాన్ని ఆసరాగా చేసుకొని సదరు ఉద్యోగి ఆపరేటర్ల వద్ద పెద్ద ఎత్తున డబ్బులు గుంజుతున్నట్టు తెలుస్తోంది.
ఆపరేటర్లకు సంబంధించిన అనేక అవకతవకలు బయటికి రావడం.. వ్యవహారశైలి వివాదాస్పదం కావడంతో వారిని జిల్లా వ్యాప్తంగా బదిలీ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తమకు నచ్చిన మండలంలో పోస్టింగ్ కోసం ఆపరేటర్లు లాబీయింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సదరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వద్దకు వచ్చిన ఆపరేటర్లు తమకు మంచి ప్లేసులు, ఆదాయం వచ్చే మండలాలు ఇవ్వాలని కోరగా, రూ.2లక్షల నుంచి రూ.3లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.
కొత్తగా వచ్చిన అధికారి తనకు క్లోజ్ అయ్యారని, మీరేం భయపడకండి.. అన్నీ తాను చూసుకుంటానని అంటూ అభయం ఇచ్చి అప్పుడే పని మొదలు పెట్టినట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆపరేటర్లకు సంబంధించిన పోస్టింగ్ జాబితాను సదరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి స్వయంగా తయారు చేసి ఉన్నతాధికారికి నివేదించినట్లు సమాచారం. తనకు నచ్చిన వారిని, నచ్చిన మండలానికి కేటాయిస్తూ రూపొందించిన జాబితా ఈరోజో.. రేపో ఆమోదం పొందేలా ఉండడం చూసి ఉన్నతాధికారులు సైతం తలపట్టుకుంటున్నట్లు తెలిసింది. కాగా, ఈ విషయమై సంబంధిత శాఖ అధికారిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందన కరువైంది.