Minister Adluri | ధర్మపురి, జూలై 17: ఇందిరమ్మ ఇండ్ల పథకానికి నేను అర్హుడిని కాదా సారూ… అంటూ ఓ దివ్యాంగుడు గురువారం ధర్మపురిలో జరిగిన బీసీ అభినందన సభలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మొరపెట్టుకున్నాడు. మంత్రితో ఆ దివ్యాంగుడి మాటల్లోనే.. ‘అయ్యా.. నాది గొల్లపెల్లి మండలం ఆత్మకూర్. నా పేరు అత్తిన రాజమల్లు. నాకు కనీసం కింద కూర్చోలేనంతగా అంగ వైకల్యం ఉంది. ఒక బెడ్ షీట్లో ఓ ఇద్దరు వ్యక్తులు నన్ను తీసుకువెళ్లి రోడ్డు పక్కన పడుకోబెడితే అడుక్కుంటూ జీవిస్తున్నాను.
నాకు స్వంత ఇళ్లు లేదు. ఇందిరమ్మ ఇళ్లు కావాలని దరఖాస్తు చేసుకున్న. కానీ లిస్టులో పేరు రాలేదు. అధికారులు, స్థానిక నాయకుల చుట్టూ తిరిగినా పట్టించుకుంటలేరు. నేను ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అర్హుడిని కానా సారూ.. నాకు దయచేసి ఇందిరమ్మ ఇళ్లు, బ్యాటరీ సైకిల్ ఇప్పించండి సారూ..’ అంటూ విన్నవించుకున్నాడు. మంత్రి స్పందించి వారం రోజల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు..