Dharmaram | ధర్మారం, జులై 7 : సివిల్ సమస్యల విషయంలో ఫిర్యాదారులు అనవసరంగా పోలీసులను లాగొద్దని పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఏసీపీ జి కృష్ణ, సీఐ కె ప్రవీణ్ కుమార్ తో కలిసి ఆయన మంగళవారం సందర్శించారు. ఠాణాలో రికార్డులను పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రిసెప్షన్ గదిని సందర్శించి ఫిర్యాదుల నమోదు రికార్డును పరిశీలించి సలహా సూచన అందజేశారు. స్థానిక ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ పనితీరు బాగుందని ఆయన మెచ్చుకున్నారు. అనంతరం డీసీపీ రామ్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సివిల్ వ్యవహార విషయాలు గ్రామస్థాయిలోని ఫిర్యాదారులు కూర్చొని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. సివిల్ విషయాలను అనవసరంగా పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి అందులోకి పోలీసులను లాగొద్దని ఆయన సూచించారు. గ్రామస్థాయిలో పరిష్కారం గాని పక్షంలో సివిల్ వ్యవహారాలను కోర్టులో పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
డివిజన్ పరిధిలో డ్రగ్స్ నిర్మూలన కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి గ్రామాలలో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేసినట్లు ఆయన వివరించారు. పోలీస్ శాఖ నిర్వహించే అవగాహనతో డ్రగ్స్ తీసుకోవడం వల్లే కలిగే అనర్థాలను ప్రజలు తెలుసుకుంటున్నారని ఆయన అన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం రాష్ట్రస్థాయిలోనే ఈగల్ ఫోర్స్ రిటైర్డ్ డీజీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా డ్రగ్స్ తో ప్రభావితంగా విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ రామ్ రెడ్డి సూచించారు.
డ్రగ్స్ విక్రయం గురించి తెలిస్తే తమకు సమాచారాన్ని ఇస్తే వారి విషయాన్ని గోప్యంగా ఉంచి చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరగాళ్లు సెల్ ఫోన్ లకు పంపించిన ఓటీపీలకు స్పందించవద్దని ఆయన హితవు పలికారు. నేరాల నిర్మూలనకు గ్రామాలలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు స్థానికులు ముందుకు రావాలని ఆయన కోరారు. పెద్దపల్లి డివిజన్ పరిధిలో పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మారం ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.