మంథని, ఏప్రిల్ 5 : ‘ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ మహనీయుల చరిత్రను ప్రజలకు తెలియకుండా తొక్కిపెట్టింది. మంథనిలోనూ మేం ఏర్పాటు చేయించిన విగ్రహాలను తాకవద్దని వారి పార్టీ నాయకులకు ఆదేశాలు ఇస్తూ అపహాస్యం చేస్తున్నది’ అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజమెత్తారు. మంథనిలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు. దళితుల ఆకలి తీర్చిన గొప్ప వ్యక్తి జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. 2014లో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే సమాజం కోసం పోరాటం చేసిన బాబూ జగ్జీవన్ రామ్, పీవీ నర్సింహారావుతో పాటు ఎంతో మంది మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. ఇక్కడి ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న వ్యక్తి కేవలం ఎన్నికల టైంలో మాత్రమే మహనీయుల విగ్రహాలను వాడుకున్నారని, ఎన్నికలు వస్తే ఒకలాగ.. ఎన్నికల అయి పోయిన తర్వాత మరోలా ఉంటున్నారన్నారని ఎద్దేవా చేశారు. తనను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ప్రతి ఏడాది నిర్వహించినట్టుగానే ఈ నెల 11 నుంచి 15 వరకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మహనీయుల దీక్షను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఎగోళపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, ఎక్కటి ఆనంతరెడ్డి, వెల్పుల గట్టయ్య, మంథని లక్ష్మణ్, ఆరెపల్లి కుమార్, ఆకుల రాజబాబు, గొబ్బూరి వంశీ, ఎరుకల రవి, నాయకులు పాల్గొన్నారు.