Farmers | హుజురాబాద్ రూరల్, ఏప్రిల్ 27 : రైతులు వరి ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టవద్దని హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి పేర్కొన్నారు. ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వరి ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టి రాత్రి పూట కుప్పలుగా పోసి టార్పాలిన్ కవర్లు, బండ రాళ్లు ఇష్టానుసారంగా ఉంచడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మన కుటుంబ సభ్యులు, మన గ్రామస్తులు, రైతు సోదరులే ఈ ప్రమాదాలకు గురవుతూ ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయన్నాని వాపోయారు. అంతేకాక ఇటీవల జరిగిన ప్రమాదాల వల్ల పలు కుటుంబాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని చెప్పారు.
రోడ్డు ప్రమాదాలను నివారించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, వరి ధాన్యాన్ని కల్లాల వద్ద లేదా ఇంటి ప్రాంగణంలోనే ఆరబెట్టుకోవాలని అన్నారు. రహదారులపై ధాన్యం పోయకూడదని . అవసరమైతే గ్రామ పంచాయతీ సూచించిన ప్రదేశాల్లో మాత్రమే ఆరబెట్టాలని కోరారు. రాత్రి సమయంలో ఎలాంటి అడ్డంకులు రహదారిపై ఉంచకూడదని, రహదారులపై ధాన్యం పోసిన వారికి నోటీసులు జారీచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతు సోదరులు పోలీసు శాఖ విజ్ఞప్తిని గౌరవించి, రహదారులపై ధాన్యం పోయకుండా సహకరించాలని కోరారు.