Deputy CM Bhatti Vikramarka | పెద్దపల్లి, మే28: వచ్చే నెల 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. రాజీవ్ యువ వికాసం అమలుపై బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కే రామ కృష్ణారావుతో కలిసి బుధవారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం కింద లాభసాటి వ్యాపార యూనిట్ల గ్రౌండింగ్ చేసేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలన్నారు. రాష్ర్ట జీడీపీ వృద్ధిలో రాజీవ్ యువ వికాసం పథకం భాగస్వామ్యం కావాలన్నారు. ఒకే రకమైన యూనిట్లు మంజూరు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీసీలో పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ, జడ్పీ సీఈవో నరేందర్, డీఆర్డీవో కాళిందిని, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.