పైలెట్ గ్రామాల్లో ప్రభుత్వ పథకాల ప్రొసీడింగ్ కాపీల పంపిణీ రచ్చరచ్చగా మారింది. ప్రజాగ్రహం వెల్లువెత్తింది. రాత్రికి రాత్రే అర్హుల పేర్లు తొలగించి జాబితాలు తయారు చేశారంటూ ప్రజానీకం మండిపడింది. ఎక్కడ చూసినా నిరసనలతో అట్టుడికింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మండలానికో పైలెట్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డుల మంజూరు పత్రాలు అందజేయగా, ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. తమ పేర్లు లేవని, అర్హుల ఎంపిక సరిగా జరగలేదంటూ విరుచుకుపడ్డారు. కొన్నిచోట్ల కన్నీరు పెడుతూ.. దండం పెడుతూ తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. పలుచోట్ల అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మొదలైన మాటల యుద్ధం ఘర్షణకు దారి తీయగా, పోలీసులు అడ్డుకున్నారు.
– నమస్తే నెట్వర్క్, జనవరి 26
మెట్పల్లి రూరల్, జనవరి 26: మెట్పల్లి మండలంలోని విట్టంపేట గ్రామసభలో గందరగోళం నెలకొంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావుతో కలిసి మండల ప్రత్యేకాధికారి సత్యనారాయణ, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ మహేశ్వర్‌రెడ్డి లబ్ధిదారుల పేర్లను చదువుతూ మంజూరు పత్రాలు అందజేయగా, అర్హులను విస్మరించి అనర్హులకు పెద్దపీట వేశారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అన్ని అర్హతలున్నా ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మూడు రోజుల కింద పంచాయతీ కార్యాలయంలో ఉంచిన లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లున్నాయని, ఇప్పుడెందుకు లేవంటూ ప్రశ్నించారు. రాత్రికి రాత్రే తమ పేర్లను తొలగించి తీరని అన్యాయం చేశారంటూ అధికారులు, కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. కాగా, అర్హత ఉండి పథకాలు రాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించడం విశేషం.
జమ్మికుంట, జనవరి26: ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాల్లో అర్హులకు అన్యాయం జరిగిందంటూ జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామస్తులు గొడవ చేశారు. ఆదివారం ప్రత్యేకాధికారి కిరణ్(డిప్యూటీ కలెక్టర్) ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించగా, ఆత్మీయ భరోసా 34, రైతు భరోసా 537, రేషన్ కార్డులు 19, ఇందిరమ్మ ఇళ్లు 166 మంది అర్హులంటూ అధికారులు చదివి వినిపించారు. అందులో కూడా కేవలం ఒక్కో పథకం నుంచి ఐదుగురికి మాత్రమే ప్రొసీడింగ్‌లు అందజేశారు. ప్రకటించిన పథకాల్లో అర్హులు చాలా మంది ఉన్నారని, ఏ ప్రాతిపదికన పేర్లు ప్రకటించారని పలువురు అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్లలో అర్హులైనవారి పేర్లు తొలగించారని ఆందోళనకు దిగే ప్రయత్నం చేశారు. ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు. అధికారులు కలుగజేసుకొని, అర్హులందరికీ పథకాలు వర్తిస్తాయని, మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కమాన్‌పూర్, జనవరి 26: నాలుగు పథకాలకు సంబంధించి రొంపికుంట గ్రామంలో ఆదివారం ప్రొసీడింగ్స్ కాపీల పంపిణీ రసాభాసగా మారింది. మండల ప్రత్యేకాధికారి ప్రవీణ్‌రెడ్డి అధ్యక్షతన రైతు భరోసా మినహా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 10 మంది చొప్పున మంజూరు పత్రాలను అందజేయగా, మిగిలిన వారికి ఎప్పుడు పంపిణీ చేస్తారంటూ గ్రామస్తులు, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్రశ్నించారు. ఎంపికైన వారి పేర్ల జాబితా ఈ సభలోనే చదివి వినిపించాలని పట్టుబట్టారు. కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొన్నది. వేదిక ముందు కూర్చున్న కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్, బీజేపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు ఇరు పక్షాల నాయకులను అక్కడి నుంచి పంపించారు. పనిలో పనిగా అధికారులు సభను ముగించేశారు.
కొత్తపల్లి, జనవరి 26 : బద్దిపల్లి గ్రామంలో ప్రొసీడింగ్స్ పంపిణీ నిరసనల మధ్య సాగింది. అర్హులకు కాకుండా కేవలం కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారికే పథకాలు వర్తింప చేశారంటూ గ్రామస్తులు మండిపడ్డారు. అధికారులను నిలదీశారు. బీఆర్ఎస్ నాయకుడు ఉప్పు రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పినట్లు గ్రామంలో నాలుగు పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాల్సి ఉండగా, కేవలం మొక్కుబడిగా కొంతమందికి మాత్రమే ప్రొసీడింగ్స్ అందజేశారని మండిపడ్డారు. ప్రభుత్వం చెప్పేదొకటి, చేసింది మరొకటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్దపల్లిరూరల్, జనవరి 26: నిమ్మనపల్లిలో లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ కాపీల పంపిణీ ఆగమాగం జరిగింది. అయితే, పలు మంజూరు పత్రాల్లో సంబంధిత మంత్రితోపాటు ముఖ్యమంత్రి సంతకం కాదు కదా.. కనీసం ఏ ఒక్క అధికారి సంతకం లేకపోవడంతో లబ్ధిదారులు విస్మయానికి గురయ్యారు. పథకాలు తమకు వచ్చినట్టా.. రానట్టా..? అని ఆలోచనలో పడిపోయారు. అయితే, కొందరు తమకు అర్హతలున్నా ఆత్మీయ భరోసా రాలేదని పలువురు మహిళలు, వృద్ధులు అధికారులను నిలదీశారు.
ముత్తారం, జనవరి 26: పైలెట్ గ్రామం మచ్చుపేటలో రైతు భరోసా 328, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 58, ఇందిరమ్మ ఇండ్లు 41, రేషన్ కార్డుల 88 మందికి ప్రొసీడింగ్స్ అందజేయగా, అనర్హులకే పెద్దపీట వేశారని అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలో గోడకు అంటించిన లిస్టులో తమ పేర్లు ఉన్నాయని, అయితే రాత్రికి రాత్రే తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇబ్రహీంపట్నం, జనవరి 26: ఎర్రాపూర్ గ్రామంలో ప్రొసీడింగ్ కాపీల పంపిణీ రసాభాసగా మారింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏడుగురికి, ఇందిరమ్మ ఇండ్లు 21 మందికి, రేషన్‌కార్డులు ఆరుగురికి, రైతు భరోసా 15 మందికి మాత్రమే పంపిణీ చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ ఇస్తామని చెప్పి ఇప్పుడు కొందరికే ఇవ్వడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులను నిలదీశారు.
మానకొండూర్ రూరల్, జనవరి 26: ‘సర్ నాది పేద కుటుంబం. కూలీ పనిచేస్తేనే పూటగడుస్తది. ఇయ్యాళ మా ఊళ్లే పథకాల మంజూరు పత్రాలు ఇస్తున్నరు గదా.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో నా పేరు లేదు. ఎవ్వలెవ్వలియో..? వచ్చినయ్..? నా పేరెందుకు రాలేదో సారు..? అర్థమైతలేదు’ అంటూ ముంజంపల్లి గ్రామానికి చెందిన కొమ్ము లక్ష్మి ఆదివారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో గోడు వెల్లబోసుకున్నది. ముంజంపల్లి గ్రామ సభలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరు కాగా, లక్ష్మి కన్నీటి పర్యంతమైంది. ‘ఉపాధి పనిలో 20 మస్టర్లు ఉంటేనే వస్తదట సర్, నేను ఉపాధి పనికి పోతే ఇల్లు గడువది. బయట పనికిపోత. ఇసోంటి కొర్రీలు పెట్టి నా పొట్టకొట్టొద్దు. నేను చేసుకుంటేనే బతుకుత’ అంటూ వాపోయింది. అయితే, బయటపనికి పోతే కూడా ఈ స్కీమ్‌కు అర్హులయ్యేలా చూస్తామంటూ ఎమ్మెల్యే దాటవేశారు.
కరీంనగర్‌రూరల్/ రుద్రంగి/ ముస్తాబాద్/ వీణవంక, జనవరి 26: కరీంనగర్ మండలం బహ్దుర్ ఖాన్పేటలో లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరుగలేదంటూ పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అర్హులకు అన్యాయం జరిగింది అనర్హులకు పెద్దపీట వేశారని మహిళలు ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం గైదిగుట్టతండాలో ఇండ్లు ఉన్నోళ్లకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త రేషన్ కార్డుల మంజూరులో అర్హులకు అన్యాయం చేశారని విస్లవత్ గణేశ్ వాపోయాడు. ముస్తాబాద్ మండలం కొండాపూర్‌లో అర్హుల ఎంపిక సరిగ్గా జరుగలేదంటూ గ్రామానికి చెందిన యువకులు మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. వీణవంక మండలం శ్రీరాములపేట గ్రామంలో అధికారులు ప్రొసీడింగ్స్ అందజేయగా, పలువురు గ్రామస్తులు అభ్యంతరం చెప్పారు. అర్హులకు అన్యాయం జరిగిందని అధికారులను నిలదీశారు.