Cheetah cubs : మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని కునో జాతీయ పార్కు (Kuno National Park) లో ‘గామిని (Gamini)’ అనే దక్షిణాఫ్రికా చీతా (South Africa Cheeta) మూడు కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి (Union Environment Minister) భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) ఎక్స్ వేదికగా తెలిపారు. 2022లో దక్షిణాఫ్రికా నుంచి ఈ గామినిని భారత్కు తీసుకొచ్చినట్లు యాదవ్ తెలిపారు.
తాజా కూనలతో కలిపి దేశంలో చీతాల సంఖ్య 38కి చేరిందని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రతి కూన జననం ‘ప్రాజెక్ట్ చీతా’ను బలపరుస్తుందని తెలిపారు. చీతాలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించి వాటి వృద్ధికి కృషి చేస్తున్న ఫీల్డ్ సిబ్బంది, వైద్యులను ఆయన అభినందించారు. గామిని మూడు కూనలకు జన్మనివ్వడంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా హర్షం వ్యక్తంచేశారు. వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్యంలో ఇది దేశానికే చరిత్రాత్మక విజయమని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
కాగా, నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుత ఆశా ఇదే పార్కులో ఈ నెల ప్రారంభంలో ఐదు కూనలకు జన్మనిచ్చింది. భారత్లో చీతాల సంతతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ చీతా’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా 2022లో నమీబియా నుంచి, 2023లో దక్షిణాఫ్రికా నుంచి చీతాలను భారత్కు తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చీతాలు పలు కూనలకు జన్మనిచ్చాయి. అయితే కొన్ని చీతాలు ఇక్కడ వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాయి.