హైదరాబాద్ : నాంపల్లి క్రిమినల్ కోర్టులో బుధవారం ఒక్కసారిగా బాంబు కలకలం రేగింది. కోర్టు భవనంలో బాంబులు పెట్టామని గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఏకంగా 12 ఆర్డీఎక్స్‌లతో కోర్టును పేల్చేయబోతున్నామని మెయిల్లో పేర్కొన్నారు. దాంతో కోర్టులోని న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.
ఈ బెదిరింపు నేపథ్యంలో పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. కోర్టు భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్‌ను, బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపి తనిఖీలు చేపట్టారు. కోర్టు భవనం మూలమూలలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఇది కేవలం ఆకతాయిల పనేనని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.