బోయినపల్లి రూరల్, అక్టోబర్ 13 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లని జీవో ఇచ్చి మోసం చేసిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అమలు చేయలేక కాంగ్రెస్ నాయకులు ప్రజలకు అనేక విధాలుగా బాకీ పడ్డారని, వారు ఓట్లు అడగడానికి వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. బోయినపల్లి మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ బాకీ కార్డులను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. అంతేకాకుండా అధికారం చేపట్టిన 22 నెలల్లో లక్షల కోట్లు అప్పు చేసి, రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేవలం వంద రోజుల్లో రైతులకు రెండు లక్షల రుణమాఫీతోపాటు ఎకరాకు 15 వేల రైతు భరోసా ఇస్తామని, పింఛన్లు రెట్టింపు చేస్తామని, విద్యార్థినులకు సూటీలు అందిస్తామని, నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని హామీలు ఇచ్చి ఏ ఒకటీ అమలు చేయకుండా ప్రజలను వంచించారని, గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేశారని మండిపడ్డారు.
అలాంటి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లడగడానికి వస్తున్నారని ప్రశ్నించారు. ఓటడిగేందుకు వస్తే ప్రజలు బీఆర్ఎస్ అందజేసిన బాకీ కార్డులను చూపించాలని, వాటిని చెల్లించిన తర్వాతే ఓట్లు అడగాలని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, మాజీ వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, మాజీ జడ్పీటీసీ కొంకటి లచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ సత్తినేని మాధవ్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, మాజీ సర్పంచులు బూర్గుల నందయ్య, చిందం రమేశ్, అకెనపల్లి కరుణాకర్, మాజీ ఎంపీటీసీ స్వామి, నాయకులు నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి, శేఖర్, ముద్దం రవి, నాగుల శ్రీనివాస్, నాగుల నాగరాజు, భీమనాథుని రమేశ్, నల్లగొండ అనిల్‌కుమార్, బోయిని రాజు, పర్స మల్లేశం, మల్లారెడ్డి, కమల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.