Government schools | జ్యోతినగర్(రామగుండం), మే 30: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూతన విద్యసంవత్సరంగాను ముందస్తుగా ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్స్ రామగుండం మండల విద్యాధికారి గడ్డం చంద్రయ్య పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని ఎంఈవో కార్యాలయంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పుస్తకాల పంపిణీని శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు.
జూన్ 12న పాఠశాలల పున ప్రారంభంతో మండలంలోని 50 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 1-10వ తరగతి విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. జూన్ 6 నుంచి జరిగే బడిబాటలో ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియపరిచి ఎన్రోల్మెంట్ పెరుగుటకు కృషి చేయాలన్నారు.
అలాగే బడిమానేసిన లేదా పదోతరగతి ఫెయిల్‌తో ఖాళీగా ఉన్న విద్యార్థులను బడిబాటలో గుర్తించి వారిని ఓపెన్ పదోతరగతి లేదా ఇంటర్లో అడ్మిషన్ తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. పాఠశాలల పున ప్రారంభం నాటికి హెచ్ఎంలు విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతుల ఏర్పాటు చేయాలని ఆదేశించారు.