Korutla Congress | కోరుట్ల, మార్చి 13: కోరుట్ల కాంగ్రెస్ పార్టీలో వేరు కుంపట్లు సంచలనం రేపుతున్నాయి. కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ అధికారులు మున్సిపల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేశారు మున్సిపల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశాన్ని పలువురు స్వపక్ష కౌన్సిలర్లు బహిష్కరించారు. ఎజెండా కాపీలను ఆలస్యంగా ఇవ్వడంపై నిరసన తెలిపారు. బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అధికార పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించడంతో నాయకుల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. బడ్జెట్ సమావేశాల్లో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు సమావేశాలను బహిష్కరించడం వెనుక వేరే కారణాలు ఏమైనా ఉన్నయా అన్న సందేహలు వ్యక్తం అవుతున్నాయి.
అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే కాంగ్రెస్ నాయకుల్లో అభిప్రాయభేదాలు పొడ చూపడం పట్టణంలో హట్ టాఫిక్ గా మారింది. మున్సిపల్ కౌన్సిల్లో మొత్తం 33 మంది సభ్యులు ఉండగా వీరిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 18 మంది కౌన్సిలర్లతో పాటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు 8 మంది, బీజేపీ నుంచి 6గురు, ఇండిపెండెంట్ సభ్యుడు ఉన్నారు. సమావేశాలకు సంబంధించి అధికారులు ముందస్తూ సమాచారం ఇవ్వకుండా ఆదరాబాదరాగా బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయడం సరికాదని ఐదుగురు కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా అదనపు కలెక్టర్ కు బుధవారం వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ యాక్ట్ ప్రకారం వారం రోజుల ముందుగా బడ్జెట్ ఎజెండా కాపీలను కౌన్సిలర్ లకు అందజేయాలని కానీ అధికారులు కేవలం రెండు రోజుల ముందుగా కాపీలు అందించారని అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. బడ్జెట్ సమావేశాన్ని వాయిదా వేయించాలని కోరారు.
అధికారులు మాత్రం బడ్జెట్ సమావేశాలను యథావిధిగా నిర్వహించడంతో ఫిర్యాదు చేసిన కౌన్సిలర్లు బడ్జెట్ సమావేశాలను శుక్రవారం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ కౌన్సిలర్లు అన్నం లావణ్య, గడ్డమీది పవన్, యాటం పద్మ, తోట గంగాధర్, రహీం మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాన్ని అధికారులు ఆదరాబాదరాగా ఏర్పాటు చేయడం సరికాదన్నారు. బడ్జెట్ సమావేశాలను తూతూమంత్రగా ఏర్పాటు చేసిన చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిదులుగా ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన అవసరం మాపై ఉందన్నారు.
నిబంధలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన సమావేశాలను బహిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కాగా ఏకపక్షంగా మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులను ఖరారు చేయడంలో అధిష్టానం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై కొంతమంది కౌన్సిలర్లు అలకబూనినట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి బడ్జెట్ ఎజెండా కాపీలను వారం రోజుల ముందుగా ఇవ్వక పోవడాన్ని తప్పు పడుతూ సదరు కౌన్సిలర్లు తమ అసంతృప్తిని దీని ద్వారా బహిర్గత పరిచినట్లు ప్రచారం జరుగుతుంది. కాగా స్వపక్షం లోని సభ్యులే సమావేశాన్ని బహిష్కరించడం పట్టణంలో చర్చనీయాశంగా మారింది.