కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థల ఇంజినీరింగ్ అధికారి ఈఈ రోడ్డ యాదగిరి నగరపాలక సంస్థ కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం మధ్య వివాదం రోజురోజుకు ముదురుతుంది. ఈ వివాదం కాస్తా ఇప్పుడు ఉన్నతాధికారులకు ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది. తనపై కాంట్రాక్టర్ నారాయణ దౌర్జన్యం చేశాడని ఈఈ యాదగిరి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈనెల ఈనెల 19న ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్‌గా ఈఈ యాదగిరి కాంట్రాక్టర్లను వేధిస్తున్నాడని ఆయన పై చర్యలు తీసుకోవాలంటూ కాంట్రాక్టర్ల సంఘం నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అయితే ఈఈ యాదగిరి పై ఆరోపణలు చేయడం సరికాదు అంటూ కాంట్రాక్టర్ల సంఘానికి చెందిన కొంతమంది కాంట్రాక్టర్లు ఎదురు తిరగడం నగరపాలక సంస్థలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు కాంట్రాక్టర్లు, ఈఈ మధ్య వివాదం నడుస్తుండగా ఇప్పుడు నూతనంగా కాంట్రాక్టర్ల సంఘంలోనే రెండు వర్గాలు కావడతో అసలు ఏం జరుగుతుందన్న చర్చ జోరందుకుంది.
నగర పాలక సంస్థ లో ఇంజినీరింగ్ విభాగం కాంట్రాక్టర్ల మధ్య అసలేం జరుగుతుందన్న చర్చ మొదలైంది. నిన్నటి వరకు ఈఈ పై ఫిర్యాదులు చేసిన కాంట్రాక్టుల సంఘం నుంచి కొందరు కాంట్రాక్టర్లు ఈ వివాదంతో తమకు సంబంధం లేదంటూ కలెక్టర్‌ను కలవడం చర్చకు దారి తీసింది. కలెక్టర్ కు అందించిన వినతి పత్రంలో ఏకంగా కాంట్రాక్టర్లు కొందరు కాంట్రాక్టర్ల తీరుపై విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొంతమంది కాంట్రాక్టర్లు తమ పనుల కోసం ఇంజినీర్ అధికారులను ఏసీబీకి పట్టిస్తామని బెదిరిస్తున్నారని పేర్కొనడం గమనించాల్సిన విషయం. ఒక అధికారికి కాంట్రాక్టర్‌కు మధ్యల జరిగిన వివాదానికి సంఘాన్ని కలపడం ఏమిటని వారు ప్రశ్నించడం విశేషం. ఈఈ యాదగిరి పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, తమకు అధికారితో ఎలాంటి గొడవలు లేవని వారు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పుడు ఇంజినీరింగ్ కాంట్రాక్టర్ల అవినీతి పై చర్చ సాగుతున్నది. మునుముందు ఎలాంటి వివాదాలకు దారితీస్తాయోనని జిల్లాలో చర్చించుకుంటున్నారు.