‘కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు విసుగెత్తి పోయారు. ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు. ప్రజా సమస్యలపై పోరాడుదాం. పరిష్కారమయ్యేదాకా ఉద్యమిద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురుతుంది. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకున్న అభిమానంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధిస్తాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణ మండపంలో బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి అధ్యక్షత జరిగిన పట్టణ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరై, స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై రాష్ట్రంలోని ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని, కార్యకర్తలు రంగంలోకి దిగాలని సూచించారు. తమ పరిధిలో ఉన్న సమస్యలపై పోరాటం చేయాలని, అవసరమైతే అవి పరిష్కారమయ్యే వరకు ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో విసృతంగా పర్యటించారు. హైదరాబాద్ నుంచి నేరుగా గంభీరావుపేట మండల కేంద్రానికి చేరుకుని పార్టీ కార్యకర్త కుటుంబానికి చెందిన నవిత-సంజయ్, ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో బొల్లు శ్రీధర్, శివానీ, సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో మాజీ ఎంపీటీసీ కుంటయ్య కూతురు లక్షత (భార్గవి) వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం చంద్రంపేటలో సోలార్ పవర్‌పాయింట్ షోరూంను ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన సిరిసిల్ల పట్టణ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. పల్లెల్లో వీధి దీపాలు వెలగడం లేదని, పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందన్నారు.
ప్రజల పక్షాన నిలిచి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లపాటు అందరికీ మంచి చేశామే తప్ప ఎవరికి కీడు చెయ్యలేదని గుర్తు చేశారు. చెడు చేసే అలవాటు మనకు లేదని, ఎవరైనా మన జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సిరిసిల్ల వస్త్ర వ్యాపారులకు అండగా నిలువాలని సూచించారు. విద్యుత్ బిల్లుల సబ్సిడీ నిధులు మంజూరయ్యే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాలు, మండలాల వారీగా ఇన్చార్జిలను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల వద్దకు వెళ్లి, కాంగ్రెస్ ప్రభుత్వం పై వస్తున్న వ్యతిరేకతను వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు చేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నా కోసం పని చేశారని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మీ విజయం కోసం పనిచేస్తానని మాజీ కౌన్సిలర్లకు, కార్యకర్తలకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. కార్యక్రమాల్లో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, పార్టీ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, మ్యాన రవి, అర్బన్ బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, బొల్లి రామ్మోహన్, పార్టీ మండలాధ్యక్షులు గజభీంకార్ రాజన్న, వెంకటస్వామిగౌడ్, సింగిల్‌విండో చైర్మన్లు బండి దేవదాస్‌గౌడ్, భూపతి సురేందర్, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, నాయకులు మాట్ల మధు, వలకొండ వేణుగోపాలరావు, జక్కుల నాగరాజు యాదవ్, ఎగుమామిడి వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పదేళ్ల కాలంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా ఉన్నాయి. మండుటెండల్లోనూ మత్తళ్లు దుంకాయి. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడారిగా మారాయి. అందుకు సిరిసిల్ల మధ్యమానేరు, వాగులే నిదర్శనం. మండుటెండల్లో సిరిసిల్ల మానేరు నిండుగా పారింది. ఈ సర్కారు వచ్చాక చుక్కనీరు లేక అడుగంటి పోయింది. కేసీఆర్ హయాంలో సిరిసిల్ల ప్రాంతంలో 6 మీటర్ల ఎత్తుకు భూగర్భ జలాలు ఉబికి వస్తే ఇప్పుడు 9 మీటర్ల లోతుకు దిగిపోయాయి. అందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం.
పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా మారింది. అందుకు ప్రజా క్షేత్రంలో ఇప్పటికీ ప్రజలంతా కేసీఆర్ పాలనను గుర్తు చేస్తున్నరు. నేను ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ పాలనే బాగుండేదంటూ ప్రజలు చెబుతున్నరు. నేను సిరిసిల్లలోని బీవైనగర్‌లో పర్యటించినప్పుడు చాలా మంది మహిళలు కాంగ్రెస్ పాలనలో ఎదొర్కొంటున్న ఇబ్బందులు, పడుతున్న బాధలను నాకు చెప్పుకుంటూ ఏడ్చిన్రు. ఇది నన్ను బాగా కలిచి వేసింది. కరెంటు రాదు, నీళ్లు ఇవ్వరు, ఇంకా అనేక సమస్యలను ఏకరువు పెట్టిన్రు. కేసీఆర్ పాలనే రావాలని కోరుకున్నరు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? కేసీఆర్‌కు మళ్లీ ఓటు వేసి ఎప్పుడు గెలిపించుకుందామా? అని ఎదురుచూస్తున్నరు.