జగిత్యాల టౌన్, నవంబర్ 27: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పోరాటంతోనే తెలంగాణ కల సాకారమైందని, ఆ ఉద్యమం భావితరాలకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు ప్రశంసించారు. కేసీఆర్ తెలంగాణ కోసం ఎంతో తపించారని, జాతీయ స్థాయి నాయకులను ఒప్పించి రాష్ర్టాన్ని సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. ఈ నెల 29న దీక్షా దివస్ సందర్భంగా బుధవారం జగిత్యాలలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. శుక్రవారం జగిత్యాల బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగే దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ సలీం బాధ్యతలు వహిస్తారని చెప్పారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాల్టీల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, జగిత్యాల బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, అవారి శివకేసరిబాబు, దారిశెట్టి రాజేశ్, అయ్యోరి రాజేశ్, నరేందర్‌రెడ్డి, ప్యాక్స్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మైనార్టీ నాయకులు అమీన్బాయ్, వొళ్లెం మల్లేశం, చేని తిరుపతి పాల్గొన్నారు.
అనేక ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధించుకున్నాం. ఉద్యమం నుంచి రాజకీయ పార్టీగా మారిన తర్వాత ఆనాడు చేసిన పోరాటం గురించి మర్చిపోతున్నాం. మనం చరిత్రను ఎప్పుడు మర్చిపోతామో..? అప్పుడే మనల్ని ప్రజలు కూడా మర్చిపోతారు. తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ పదేండ్లలో చేసిన అభివృద్ధితోపాటు పద్నాలుగేండ్లు తెలంగాణ సాధన కోసం చేసిన ఉద్యమం గురించి అందరం చెప్పుకోవాలి.
– కల్వకుంట్ల సంజయ్, కోరుట్ల ఎమ్మెల్యే