గంభీరావుపేట, సెప్టెంబర్ 21: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు విలువైన సలహాలు అందించడమే లక్ష్యంగా ఎం స్వార్థ్, నాబార్డ్ ఆధ్వర్యంలో ఈ-క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా గంభీరావుపేట ప్రాథమిక వ్య వసాయ సహకార సంఘ ఆవరణలో రాష్ట్రంలోనే ప్రథమం గా ఏర్పాటు చేయగా, శనివా రం నాబార్డు రిసోర్సు పర్సన్ షరీఫ్, నాఫ్స్ కాబ్ మాజీ చైర్మన్, కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎం స్వాస్థ్ సౌత్ ఇండియా మార్కెటింగ్ రీజినల్ హెడ్ శరత్చంద్రతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ- క్లినిక్ ద్వారా అందిస్తున్న డిజిటల్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఒక్కో కుటుంబం 365 చెల్లిస్తే ఏడాదిపాటు తమ అరోగ్య సమస్యలపై ఎమ్ స్వాస్థ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అం దిస్తున్నట్లు తెలిపారు. దేశంలో 3500 ఈ-క్లినిక్ కేం ద్రాలను ఏర్పాటు చేశామని శరత్చంద్ర తెలిపారు. ప్రీమియం చెల్లించిన సం ఘం పరిధిలోని వారికి ఏడాది పాటు ఈ క్లినిక్ ద్వా రా 400 మంది వైద్యులు ఆన్లైన్లో ఆడియో, వీడియో ఆధారంగా సలహాలు, సూచనలు అందిస్తారని, 24 గంటల సౌకర్యం ఉంటుందని తెలిపారు. 38 రకాల మందులను ఉచితంగా అందిస్తామన్నారు.
రాష్ట్రంలో ప్రాథమిక సహకార సంఘాలు, నాబార్డు సౌజన్యంతో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలో ఫైలట్ ప్రాజెక్టు కింద16 ఈ-క్లినిక్ కేంద్రాల్లో ఏర్పాటుకు ఎంచుకున్నామని తెలిపారు. అందులో మొట్ట మొదటగా గంభీరావుపేటలో ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఈవో రాజిరెడ్డి పాల్గొన్నారు.