కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి 26 : ఇంటర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతాయని, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని డీఐఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఈసీ సభ్యులు ఆంజనేయరావు, రవీందర్ రెడ్డి, కేదారేశ్వర్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశామని, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాయవచ్చని తెలిపారు.
జిల్లాలో మొదటి సంవత్సరంలో 16,590 మంది విద్యార్థులు, రెండో సంవత్సరంలో 16,959 మంది విద్యార్థులు మొత్తం 33,549 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు. ఇందుకోసం 56 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థులను 45 నిమిషాల ముందు నుంచే పరీక్షాకేంద్రంలోకి అనుమతిస్తారని చెప్పారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ కళాశాలకు వెళ్లి తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆన్లైన్ నుంచి సైతం డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 56 మంది సీఎస్‌లు, 56 మంది డీవోలను నియమించామని చెప్పారు. అలాగే, డీఈసీ స్కాడ్, హెచ్పీసీ స్కాడ్, మూడు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు, నాలుగు సిట్టింగ్ స్కాడ్ బృందాలు నిరంతరం పరీక్షలను పర్యవేక్షిస్తాయని చెప్పారు.
విద్యార్థులకు పరీక్ష కేంద్రంలో అందుబాటులో ఒక ఏఎన్ఎం లేదా ఆశ కార్యకర్త ఉంటారని తెలిపారు. జిల్లాలోని పరీక్షా కేంద్రాలు తెలియని వారు ఇంటర్మీడియట్ యాప్ సహాయంతో సరాసరి పరీక్ష కేంద్రానికి వెళ్లేలా లొకేషన్ ఏర్పాటు చేశామని వివరించారు. ఆర్టీసీ, టీఎస్ ఎన్పీడీసీఎల్, ఇతర శాఖల సమన్వయంతో పరీక్షలు సవ్యంగా సాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే, ఒత్తిడికి లోనయే విద్యార్థులకు టోల్‌ఫ్రీ నెంబర్‌ను అందుబాటులో ఉంచామని, పరీక్షా కేంద్రం విషయంలో అనుమానాలు ఉంటే టీఎస్‌బీఐఈ ఎం సర్వీస్ ద్వారా హాల్ టికెట్ నంబరు లేదా సెంటర్ నంబర్‌తో సెంటర్ లొకేషన్ వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు. పరీక్షల్లో ఇన్విజిలేటర్ల కొరత కారణంగా జిల్లా విద్యాశాఖాధికారి సహకారంతో 170 మంది ఉపాధ్యాయుల సేవలను ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఆయా రూట్లలో పరీక్షకేంద్రాలకు ప్రశ్నపత్రాలు చేరుకున్నాయని తెలిపారు.