హైదరాబాద్, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ): పెద్ద మొత్తంలో అటవీ భూములను ఆక్రమించి, అక్రమ నిర్మాణాలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న దకన్ సిమెంట్ యాజమాన్యంతోపాటు సంబంధిత అధికారులపై సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ విచారణ జరుపనున్నది. ఇందుకు సంబంధించి దక్కన్ సిమెంట్ యాజమాన్యంతోపాటు తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల పరిధిలోని సైదుల్ నామ రిజర్వ్డ్ ఫారెస్ట్ భూమిలో జరిగిన అక్రమాలపై పసుపులేటి సురేశ్ అనే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వానికి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు, ప్రధాన మంత్రి కార్యాలయానికి, సుప్రీంకోర్టు పరిధిలోని సీఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఫిర్యాదును పరిశీలించిన సీఈసీ.. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని గతంలో నోటీసులు జారీ చేసింది. దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశించింది.