స్వయం పాలన, స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో.. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. ఇవాళ మీ ఢిల్లీ దర్బార్‌లో మోకరిల్లడం ఈ నేల ఆత్మగౌరవాన్ని భంగపరుస్తున్నది. తెలంగాణ ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నది స్వతంత్ర సర్కార్‌నా? లేక ఢిల్లీకి గులాంగిరీ చేసే సామంత ప్రభుత్వాన్నా? తెలంగాణ పోరాటాల గడ్డ.. ఇది ఎన్నటికీ ఢిల్లీకి గులాం కాదు.. ఈ గడ్డ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాలని చూస్తే మీ కాంగ్రెస్‌ను చరిత్ర క్షమించదు. హరీశ్ హెచ్చరిక
హైదరాబాద్, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల స్వీయ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణ క్యాబినెట్‌ను ఢిల్లీకి పిలిపించుకొని కాంగ్రెస్ అధిష్ఠానం చేయబోయే సమీక్షపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, కర్ణాటక సీఎం సిద్ధ్దరామయ్యలకు హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. ‘తెలంగాణ పోరాటాల గడ్డ.. ఇది ఎన్నటికీ ఢిల్లీకి గులాం కాదు.. ఈ గడ్డ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాలని చూస్తే మీ కాంగ్రెస్‌ను చరిత్ర క్షమించదు’ అని హెచ్చరించారు.
ప్రజావిద్రోహానికి క్షమాపణ చెప్పండి
ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజాద్రోహానికి పాల్పడినందుకు ముందు క్షమాపణలు చెప్పిన తర్వాతే సమీక్షలు ప్రారంభించాలని కాంగ్రెస్ అగ్రనేతలకు హరీశ్‌రావు హితవుచెప్పారు. ‘ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్న మీకు, ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చి ఇచ్చిన మీ హామీలను గుర్తుచేస్తున్నాను. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, ఇప్పటికే రెండున్నరేండ్లు గడిచింది. మిగిలిన కొద్దికాలంలో అయినా మీరు ఇచ్చిన హామీలకు కట్టుబడి త్వరగా నెరవేర్చాలని, ఆ దిశగా మీ ముఖ్యమంత్రికి హితబోధ చేయాలని కోరుతున్నా. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని మీరు హామీ ఇచ్చారు. తీరా చూస్తే బిల్లు ‘నిల్ అయింది’. ప్రజల విశ్వాసం కిల్ అయింది. ఈ ప్రజా విద్రోహానికి క్షమాపణలు చెప్తూ మీ సమీక్ష ప్రారంభించండి’ అని సూచించారు.
ప్రియాంకగాంధీ గారూ..
‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి క్రమం తప్పకుండా ఖాళీలు భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు రూ.4వేల భృతి ఇస్తామని, 18 ఏండ్లు పైబడిన ప్రతి యువతికీ ఎలక్ట్రిక్ సూటర్లు ఇస్తామని సరూర్‌నగర్ స్టేడియంలో ఆర్భాటంగా ప్రకటించారు. అంతే సౌకర్యంగా విస్మరించారు. ఇందులో ఏ ఒక హామీ అమలు కాకపోగా, నిరుద్యోగుల మీద దమనకాండ జరుపుతున్నది ఘనత వహించిన మీ రేవంత్ ప్రభుత్వం. యువత, నిరుద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేసి, వాళ్ల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న మీ కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరికి మీరు బాధ్యులు కాదా? దీనిపై సమీక్ష చేస్తారా? ప్రజలకు సమాధానం చెప్తారా?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
మల్లికార్జున ఖర్గే గారూ..
‘ఎస్సీల రిజర్వేషన్లు 18శాతానికి పెంచుతామని, అన్ని ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్లలో, కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో అనేక హామీలు గుప్పించారు. అమలుచేయక తప్పించారు. దళిత బిడ్డలను దగా చేసి ఓట్లు దండుకున్న మీ నమ్మక ద్రో హంపై ఏమని సమీక్ష చేసుకుంటారు? ఇంకా చెప్పాలంటే 420 హామీలను ప్రస్తావించాలి. రాష్ట్రంలో ప్రజలు నానా రకాల పాట్లు పడుతున్నారు. పాలన గాలికొదిలి ఢిల్లీకి చకర్లు కొడుతున్న సీఎం వైఖరితో తెలంగాణ బతుకు తెల్లారిపోతున్నది. మీ సీఎం తీరు రాష్ట్రానికి గ్ర హపాటుగా మారిందని హరీశ్‌రావు గుర్తుచేశారు.
ప్రజా సంక్షేమ దీపాన్ని ఆర్పేశాడు
‘బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, దళితబంధు, బీసీ బంధు, కంటివెలుగు, చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ, మన ఊరు-మన బడి, సీఎం బ్రేక్‌ఫాస్ట్ సీమ్, రంజాన్ తోఫా, క్రిస్మస్ తోఫా, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి అనేక సంక్షేమ పథకాలను వచ్చీరాగానే మీ సీఎం రేవంత్‌రెడ్డి నిలిపేశారు. ప్రజాసంక్షేమ దీపాన్ని ఆర్పేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయక 20లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వి ద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది మీ కాంగ్రెస్ పాలన. కేసీఆర్ పాలనలో చదువులమ్మ గుడులుగా పేరుపొందిన గురుకులాల్లో నేడు చావుడప్పు మోగిస్తున్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వం. మీ ప్రభుత్వ పాపాలకు నిష్కృతి ఏమిటో సమీక్షించండి’ అని హరీశ్‌రావు కాంగ్రెస్ అగ్రనేతలకు హితవుపలికారు.
స్కీమ్‌లు లేవు.. స్కాములే..
రాష్ట్రంలో సీములేవీ లేకపోగా సాములు మాత్రం మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో పూటకో కుంభకోణంతో ప్రజాధనాన్ని ప్రభుత్వం లూటీ చేస్తున్నదని విమర్శించారు. ‘క్రోనీ కాపిటలిజానికి తెలంగాణను కాపిటల్‌గా మార్చింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సమీక్షలో మీరు అడిగేది ప్రజలకు ఇచ్చిన మాటల గురించా? లేక మీకు అందుతున్న వాటాల గురించా?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. దేశమంతా బుల్డోజర్ సంస్కృతిని వ్యతిరేకిస్తున్నామని మీరు నీతులు చెప్తుంటే తెలంగాణలో మాత్రం మీ సీఎం పేదల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయిస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ పోరాటాల గడ్డ ఇది ఎన్నటికీ ఢిల్లీకి గులాం కాదు. ఈ గడ్డ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాలని చూస్తే మీ కాంగ్రెస్‌ను చరిత్ర క్షమించదు’ అని హరీశ్‌రావు హెచ్చరించారు.
రాహుల్‌గాంధీ గారూ.. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో మీరిచ్చిన హామీలను మీరే విస్మరించారు. మీకు మళ్లీ గుర్తుచేస్తున్నా. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, కౌలు రైతులకు కూడా రైతు భరోసా, ఉపాధి కూలీలకు ఏడాదికి 12వేలు, అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్, పంట బీమా కల్పిస్తామని నమ్మించారు. రుణమాఫీ సగం మందికి ఎగ్గొట్టారు. రెండు పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టారు, బోనస్ ఒక పంటకే పరిమితం చేశారు. బీమా అటకెకించారు. మీ సర్కార్ నయవంచనపై సమీక్ష చేస్తారా?
-హరీశ్‌రావు
సోనియాగాంధీ గారూ.. ఆరు గ్యారెంటీల అమలుకు మీరు స్వయంగా హామీ ఇస్తూ బాండ్‌పేపర్లపై సంతకాలు పెట్టి ప్రజల ఓట్లు పొందారు. మీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వాకం వల్ల ఆ బాండ్లకు విలువ లేకుండా పోయింది. అవి నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాకుండా పోయాయి.
– హరీశ్‌రావు
రేపు ఢిల్లీలో ‘రెండున్నరేండ్ల రేవంత్ పాలనా వైఫల్యాలు-అమలు కాని హామీల’పై ప్రధానంగా చర్చ జరుపాలని డిమాండ్ చేస్తున్నాం. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు విషయంలో రేవంత్‌రెడ్డికి డైరెక్షన్ ఇవ్వడంతో పాటు, సాంలపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.
– హరీశ్‌రావు
సోనియాగాంధీ గారూ..
ఆరు గ్యారెంటీల అమలుకు మీరు స్వయంగా హామీ ఇస్తూ బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టి ప్రజల ఓట్లు పొందారు. మీ ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల ఆ బాండ్లకు విలువ లేకుండా పోయింది.
రాహుల్‌గాంధీ గారూ..
వరంగల్ రైతు డిక్లరేషన్‌లో మీరు ఇచ్చిన హామీలను మీరే విస్మరించారు. నమ్మిన రైతులను నట్టేట ముంచిన మీ ప్రభుత్వ నయవంచనపై సమీక్ష చేస్తారా?
ప్రియాంకగాంధీ గారూ..
యువత, నిరుద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేసి, వాళ్ల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న మీ కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరికి మీరు బాధ్యులు కాదా? దీనిపై సమీక్ష చేస్తారా? ప్రజలకు సమాధానం చెప్తరా?
మల్లికార్జున ఖర్గే గారూ..
దళిత బిడ్డలను దగా చేసి ఓట్లు దండుకున్న మీ నమ్మక ద్రోహంపై ఏమని సమీక్ష చేసుకుంటారు? – హరీశ్