హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీకి సెక్షన్-3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నూతన మార్గదర్శకాలు చెల్లబోవని, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమే జలాలను పంపిణీ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టు ఎదుట తన వాదనలు వినిపించింది. ఏపీ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్-89 మార్గదర్శకాల మేరకు కాకుండా అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం-1956లోని సెక్షన్-3 ప్రకారం కృష్ణా జలాలను పంచాలని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ-2)కు కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీచేసిన విషయం తెలిసిందే.
వీటిపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై బుధవారం వాదనలు కొనసాగాయి. కేంద్రం జారీచేసిన నూతన మార్గదర్శకాలు చెల్లబోవని, అవి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధమని ఏపీ వాదించింది. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను మార్చవద్దని ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నదని పేర్కొంటూ.. ఈ చట్టం ప్రకారమే కృష్ణా జలాలను ప్రాజెక్టులవారీగా కేటాయించాలని డిమాండ్ చేసింది. కొత్త మార్గదర్శకాలను రెండు తెలుగు రాష్ర్టాలకే గాకుండా బేసిన్లోని అన్ని రాష్ర్టాలకు వర్తింపజేయాలని, రాష్ట్ర విభజన తర్వాత చేసుకున్న తాత్కాలిక ఒప్పందాలనే కొనసాగించాలని సుప్రీంకోర్టును కోరింది. అనంతరం తదుపరి విచారణ వారానికి వాయిదా పడింది.