former MLA Korukanta Chander | పెద్దపల్లి, సెప్టెంబర్15: ‘గత 20 మాసాలుగా రామగుండం నియోజక వర్గంలో నియంత పాలన నడుస్తుంది.. కూల్చటం… కమీషన్ల కోసం కట్టడం తప్ప అభివృద్ధి లేదు.. ప్రశ్నించే గోంతులను నొక్కటం.. భయబ్రాంతులకు గురిచేయటం.. అక్రమంగా కేసులు పెట్టుడం లాంటి చర్యలతో హిట్లర్‌ను తలపించే విధంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పాలన ఉంది’ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు.
రామగుండం నియోజక వర్గంలో అరాచక పాలన నిరసిస్తూ సోమవారం గోదావరిఖని బంద్ నిర్వహించి, అరాచక పాలన నియంత్రించాలని కోరుతూ కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం చందర్ మీడియాతో మాట్లాడారు. గత 20 నెలలుగా గోదావరిఖనిలో కూల్చుడూ.. కమీషన్ల కోసం కట్టుడూ తప్ప ఏమీ లేదని ద్వజమొత్తారు. గత ప్రభుత్వం విడుదల చేసిన టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నారే తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదని విమర్శించారు. గోదావరిఖనిలో రోడ్లు వెడుల్పు కార్యక్రమాన్ని చేపట్టి ఇష్టా రీతిలో కట్టడాలను కూల్చేస్తున్నారని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.
రోడ్ల వెడల్పు వల్ల లక్ష్మినగర్, జ్యోతినగర్, ఎన్టీపీసీ ఏరియాల్లో చాలా మంది చిరువ్యాపారులు రోడ్డున పడ్డారని అవేదన వ్యక్తం చేశారు. రామగుండం ఎమ్మెల్యే అరాచక పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ పిలుపు నిస్తే.. కాంగ్రెస్ నాయకులు బంద్‌లో పాల్గొందని దుకాణాదారులను బెదిరిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే పాలన పట్ల రామగుండం ప్రజలు తీవ్ర వ్యతిరేకతో ఉన్నారని, రాబోవు ఎన్నికల్లో వాళ్లకు తగిన గుణపాఠం చెప్పుతారని పేర్కొన్నారు.
బాధితల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుందని చెప్పారు. చందర్ వెంట గోపు ఐలయ్య యాదవ్, మాజీ కార్పొరేటర్లు కృష్ణవేణి, అంజలి, విజయ, నాయకులు నూతి తిరుపతి, సత్తు శ్రీనివాస్, అసనపెల్లి శ్రీనివాస్, బొడ్డుపెల్లి శ్రీనివాస్, వెంకటేశ్, రామకృష్ణ, అల్లం ఐలయ్య, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.