తిమ్మాపూర్, ఆగస్టు 20 : రైతులు అరిగోస పడుతున్నా కాంగ్రెస్‌కు యూరియా ఇచ్చే సోయి లేదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులకు సరిపడా యూరియా ఇచ్చేదాకా ఊరుకునేదే లేదని, అప్పటిదాకా ప్రతి రోజూ ధర్నా చేస్తామని హెచ్చరించారు.
తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్‌లో సొసైటీ గోదాం వద్ద బుధవారం తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారని, సరిపడా లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న ఆయన అక్కడకు చేరుకొని మాట్లాడారు. అనంతరం పార్టీ నాయకులు, రైతులతో కలిసి నుస్తులాపూర్ స్టేజీ వద్ద రాజీవ్హ్రదారిపై ధర్నా చేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, తెల్లవారుజాము నుండే రైతులు కుటుంబాలతో కలిసి లైన్లు కడుతున్నారని అన్నారు. పనులన్నీ వదులుకుని వచ్చినా సరిపడా దొరకడం లేదని ఆవేదన చెందారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ముందుచూపుతో రైతులకు ఇబ్బందులు లేకుండా చేశారని గుర్తు చేశారు. పదేళ్లలో ఎన్నడైనా రైతులు లైన్కట్టారా..? అని ప్రశ్నించారు. ఇప్పుడు చెప్పులు క్యూలైన్లలో పెట్టి ఎదురు చూసే దుస్థితి వచ్చిందన్నారు.
ఎమ్మెల్యే సత్యనారాయణకు సొసైటీ చైర్మెన్లను పార్టీలో కలుపుకునే శ్రద్ధ.. రైతులపై లేదని ఎద్దేవా చేశారు. మానకొండూర్ నియోజకవర్గంలో రైతులకు సరిపడా యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలుపక్కన పెట్టి, రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన చెందారు.
రాజకీయాలు చేయడం తప్ప.. రైతులకు ఇబ్బందులు లేకుండా చేయడం ఆ పార్టీ నాయకులకు తెలియదని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, ల్యాగల వీరారెడ్డి, గంపవెంకన్న, పాశం అశోక్‌రెడ్డి, సాయిల్ల కోమురయ్య, పొన్నం అనిల్‌గౌడ్, నోముల శ్రీనివాస్‌గౌడ్, సదయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.