Agitation for Urea | వీణవంక, ఆగస్టు 11 : వీణవంక మండలంలో యూరియా కష్టాలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుండగా కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం రైతును రోడ్డుపైకి తీసుకొచ్చింది. గత 15 రోజులుగా ఓపికగా ఎదురు చూసిన రైతన్నలు ఒక్కసారిగా రోడ్డుపైకి ఎక్కి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. టోకెన్ల పేరిట ఇచ్చినవారికే ఇస్తూ రోజుల తరబడి తిప్పుకుంటున్నారని రైతుల ఆవేదన ఒకవైపు, మరోవైపు రెండో లైసెన్స్ కోసం ఏడీఏ కార్యాలయం వద్ద సొసైటీ అధికారుల ఎదురు చూపులు. సహనాన్ని కోల్పోయి రైతులపైకి నోరుజారిన పోలీసులు. ఇద్దరి మధ్య వాగ్వివాదం నర్సింగాపూర్ సొసైటీ వద్దకు గుంపుగా చేరిన 600 మంది రైతులు, చివరికి పోలీసు పహారా మధ్య 235 మంది రైతులకు 470 యూరియా బస్తాలు సొసైటీ సిబ్బంది పంపిణీ చేశారు.
మండలంలో మొత్తం 26 గ్రామ పంచాయితీలు ఉండగా 14 వేల మంది రైతులుండగా, 29 వేల ఎకరాలు సాగవుతున్నది. రైతులు వరినాట్లు వేసి కొందరు, పత్తి, మొక్కజొన్నకు కొందరికి యూరియా అవసరం ఉండగా ఏ ఒక్క ఫెర్టిలైజర్లో, ఆగ్రోస్లో యూరియా లేకపోవడంతో మండలంలోని రైతులందరూ నర్సింగాపూర్లోని సొసైటీ గోదాం వద్దకు వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సోమవారం గోదాంకు 470 యూరియా బస్తాలు రాగా సుమారు 600 మంది రైతులు అక్కడికి వచ్చారు. ఈ నెల 9న లిస్టు రాసిన రైతులకు మాత్రమే యూరియా ఇస్తామని, కొత్తగా కావాల్సిన వారు వీణవంకలోని సొసైటీ వద్దకు వెళ్లాలని చెప్పగా యూరియా కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని రైతులు రోడెక్కి ఆందోళన చేపట్టారు.
జమ్మికుంట -కరీంనగర్ ప్రధాన రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సర్దిచెప్పగా ధర్నా విరమించారు. దీంతో పోలీసు పహారా మధ్య సొసైటీ సిబ్బంది యూరియాను పంపిణీ చేశారు. మిగిలిన రైతులకు తరువాత వచ్చే లోడ్ యూరియా ఇస్తామని వారి పేర్లు నమోదు చేసుకున్నారు.