Free Education | ధర్మారం, జూన్ 3: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని స్మార్ట్ కిడ్స్ పాఠశాల యజమాన్యం ఓ నిరుపేద విద్యార్థినికి ఒకటి నుంచి ఉన్నత చదువుల వరకు ఉచిత విద్యను అందించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు విద్యార్థిని కుటుంబ సభ్యులకు లిఖితపూర్వక ఆమె పత్రాన్ని పాఠశాల యజమాన్యం వారికి అందజేసింది.
వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కొత్తపేట గ్రామానికి చెందిన బూట్ల రజిత, రాజేందర్ దంపతులకు కుమార్తె (7), కుమారుడు (5) సంతానం ఉన్నారు. వారిది నిరుపేద కుటుంబం కాగా ఉపాధి కోసం బూట్ల రాజేందర్ సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ రాజేందర్ జరిగిన ప్రమాదంలో మరణించాడు. దీంతో రాజేందర్ ఇద్దరూ పిల్లల పోషణ అతని భార్య రజిత పై పడింది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని వారి తల్లి పిల్లలను ఎలా చదివించాలో తెలియలేని దీనస్థితిలోకి వెళ్లింది.
దీంతో వారి ఆర్థిక పరిస్థితిని గమనించిన ధర్మారం స్మార్ట్ కిడ్స్ పాఠశాల ప్రిన్సిపల్ బుధారపు రమాదేవి, కరస్పాండెంట్ బుధారపు మహేందర్ మానవతా దృక్పథంతో రాజేందర్ కూతురు నివంతిక (7) ను వారి పాఠశాలలో ఒకటి నుంచి ఉన్నత పాఠశాల వరకు ఉచిత బోదన చేసేందుకు ముందుకు వచ్చారు.
2025 -26 విద్యా సంవత్సరం నుంచి 1 వ తరగతి మొదలుకొని ఉన్నత పాఠశాలలో చదవడానికి పాఠశాల హామీ పత్రాన్ని నివంతిక తల్లి రజిత కు, వారి కుటుంబ సభ్యులకు పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవి, కరస్పాండెంట్ మహేందర్ మంగళవారం వారి పాఠశాలలో వారికి అందజేశారు. తమ కూతురికి ఉచిత విద్యాబోధన చేయడానికి ముందుకు వచ్చిన స్మార్ట్ కిడ్స్ పాఠశాల యాజమాన్యానికి విద్యార్థిని నివంతిక తల్లి రజిత, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.