ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వేళయింది. శుక్రవారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు కలెక్టర్ యాస్మిన్ బాషా పర్యవేక్షణలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన దేవాలయంతో పాటు అనుబంధ ఆలయాల రాజగోపురాలు, ఆర్చీల ఏర్పాటు పలు చోట్ల రంగులు వేయించి విద్యుత్ దీపాలతో అలంకరించడంతో లైట్ల వెలుగుల్లో ధర్మపురి క్షేత్రం దేదీప్యమానంగా వెలుగొందుతున్నది.
ధర్మపురి, మార్చి 2 : ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాన ఆలయంతోపాటు ఇతర ఆలయాలను విద్యుత్ లైట్లతో అలంకరించారు. దేవాలయం లోపల భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు చలువ పందిళ్లు వేశారు. గోదావరి తీరంలోనూ చలువ పందిళ్లు వేయించారు. మహిళలకు దుస్తుమార్పిడి గదులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక బ్రాహ్మణ సంఘ భవనం, పాత టీటీడీ కల్యాణ మండపంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం ఈ సంవత్సరం లక్ష లడ్డూ ప్రసాదం, 25 క్వింటాళ్ల పులిహోర ప్రసాదం తయారుచేయించి భక్తులకు విక్రయించడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు.
బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు
ధర్మపురి లక్ష్మీనృసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన శుక్రవారం ఉదయం దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్, సిబ్బంది కలిసి యాజ్ఙాచార్యులు కందాళై పురుషోత్తమాచార్యుల ఇంటికి మంగళవాయిద్యాలతో వెళ్లి స్వామివారి ఉత్సవాలు నిర్వహించేందుకు సంప్రదాయ రీతిలో ఆహ్వానిస్తారు. అనంతరం ఆయనను మేళతాళాల మధ్య ఆలయానికి తీసుకవచ్చి సంప్రదాయం ప్రకారం ఆలయం పక్షాన ఈవో అర్చకులకు దీక్షావస్ర్తాలు సమర్పిస్తారు. అనంతరం స్థానిక ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు కళశ, విశ్వక్సేన వాసుదేవ, పుణ్యాహవచనం, బ్రహ్మకళశ స్థాపన, అంకురార్పణ, వరాహతీర్థం, తదితర పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్సవమూర్తులకు రక్షాబంధనం చేసి నాందీముఖం, ఇదహవచనం చేసి బ్రహ్మోత్సవాల కోసం దేవతలందరినీ ఆహ్వానించి మాతృక పూజలు నిర్వహిస్తారు.
నేడు కన్నుల పండువగా పుట్ట బంగారం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 7 గంటలకు శ్రీలక్ష్మినృసింహ స్వామి(యోగ, ఉగ్ర) శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను సేవలపై ఉంచి వరాహతీర్థం, పుట్టబంగారం కోసం తీసుకువెళ్తారు. చింతామణి చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికకు ఊరేగింపుగా వచ్చి సేవలను ఉంచి యజ్ఙాచార్యులు పురుషోత్తమాచార్యుల మంత్రోచ్ఛరణల మధ్య పండితులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. అనంతరం భక్తులు పుట్ట మట్టిని ప్రసాదంలా సేకరించి ఇండ్లకు తీసుకెళ్తారు.