ధర్మపురి, నవంబర్ 22: ‘కాంగ్రెస్ వస్తే కరెంట్ కాటకలుస్తది. తెలంగాణ మళ్లీ అంధకారమైతది. ఎవుసానికి మూడు గంటలే ఇస్తామని ఆ పార్టీ నాయకులు బాజాప్తా చెబుతున్నరు. మీకు మూడు గంటలు ఇచ్చే పార్టీ కావాలా..? 24 గంటలు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా.. మీరే ఆలోచించుకోండి’ అంటూ ధర్మపురి అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. బుధవారం ధర్మపురి మండలం రాయపట్నం, తిమ్మాపూర్, బూరుగుపల్లి, బుగ్గారం మండలం చిన్నాపూర్, సందయ్యపల్లి, బుగ్గారంలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించగా, ఆయా గ్రామాల్లో మహిళలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రైతులు వ్యవసాయ అవసరాలకు చేసిన అప్పులు కట్టకపోతే దర్వాజలు పీక్కపోయిన నీచ చరిత్ర కాంగ్రెస్‌దైతే, రైతుకు రైతుబంధు, రైతుబీమా అమలు చేసి వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసిన గొప్ప చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు. ‘మీ ఓటు తలరాత మార్చడంతో పాటు భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని, ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓటేయాలని వేయాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీల మాయ మాటలు నమ్మి ఆగం కావద్దన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు నిండాయని, ఎందరో ప్రధానులు, సీఎంలు పాలన చేస్తూ వచ్చారని, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో, ఎవరైనా చేశారా.. ప్రజలు గమనించాలని సూచించారు.
కాంగ్రెస్ వస్తే తెలంగాణ అంధకారమవుతుందన్నారు. కర్ణాటకలో 20గంటల కరెంటు అని చెప్పి 5గంటలే ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటకలో నీళ్లులేవని, రైతుబంధు లేదని, రైతుబీమా లేదని విమర్శించారు. అక్కడ పేదింటి ఆడపిల్ల పెండ్లి చేసుకంటే కల్యాణలక్ష్మి ఇవ్వడం లేదని, మరి ఇక్కడ ఎలా ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాజ్యంలో అన్నీ అరాచకాలేనని, మళ్లీ ఆ దరిద్రం మనకు అవసరమా..? అని ప్రశ్నించారు. అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమానికి కృషిచేస్తున్న బీఆర్ఎస్కే మద్దతు పలుకాలన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో పేదలకు మేలు జరుగుతుందని, విజయానికి నాంది పలుకుతుందన్నారు.
తెలంగాణలో వ్యవసాయ బావుల వద్ద, బోర్ల వద్ద మోటర్లకు మీటర్లు పెట్టనందుకే రాష్ర్టానికి రావల్సిన రూ.25వేల కోట్లను కేంద్రం కట్ చేసిందని, ఈ విషయం స్వయంగా కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఒప్పుకున్నారని మండిపడ్డారు. తెలంగాణపై ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ కక్ష కట్టాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇంటిపార్టీ బీఆర్ఎస్కే ఓటువేయాలని సూచించారు. ధర్మపురి నియోజకవర్గాన్ని ఒక పంట పొలంలా చూసుకుంటున్నానని, ఇన్నేండ్ల కాలంలో మీలో ఒకడిగా ఉంటూ వచ్చానని మరోసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని కోరారు.
ఇక్కడ డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీటీసీలు బాధినేని రాజేందర్, బత్తిని అరుణ, ఎంపీపీలు బాధినేని రాజమణి, ఎడ్ల చిట్టిబాబు, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్‌కుమార్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ సౌళ్ల భీమయ్య, సత్యనారాయణరావ్, పీఏసీఎస్ చైర్మన్ సౌళ్ల నరేశ్, వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్‌రెడ్డి, సుచేందర్, బుగ్గారం బీఆర్ఎస్ మండలాధ్యక్షులు గాలిపెల్లి మహేశ్, మండల కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ రహమాన్, సర్పంచులు ఈర్ల చిన్నక్కమొండయ్య, కాళ్ల శేఖర్, కంది తిరుపతి, ఎంపీటీసీ కాళ్ల సత్తయ్య ఉన్నారు.