ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమైంది. దశాబ్దాలుగా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కాని సమస్యలకు పరిష్కారం చూపింది. గ్రామాల్లో ఏళ్ల తరబడిగా నడిచిన పంచాయితీలను తెంచింది. భూమి విషయంలో కుటుంబాల్లో నెలకొన్న ఇబ్బందులను తొలగించింది. రిజిస్ట్రేషన్ కోసం దళారులను ఆశ్రయించడం.. రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ఉదయం నుంచి చీకటి పడేదాక పడిగాపు కాయడం.. వంటివి లేకుండా చేసింది. మ్యుటేషన్ కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగడం.. లంచాలు ముట్టచెప్పడం వంటి దరిద్రాన్ని పారదోలింది. అంతేకాదు, ప్రభుత్వం అందిస్తున్న ప్రపంచం మెచ్చిన పథకాలైన రైతుబంధు, రైతు బీమా వంటివి నేరుగా రైతుకు అందడంలో కీలకమైంది. అధికారుల చేతివాటానికి చెల్లుచీటీ పలికింది. భూ వ్యవహారాల్లో అవినీతికి అడ్డుకట్ట వేసింది. మోసాలకు స్వస్తి చెప్పింది. ఇన్ని సమస్యలకు పరిష్కారం చూపిన ధరణిని కాంగ్రెస్, బీజేపీ నాయకులు రద్దు చేస్తామని మాట్లాడడంపై రైతాంగం మండిపడుతున్నది. ఒకవేళ అలా చేస్తే మళ్లీ దళారులే రాజ్యమేలుతారని, రైతులు అరిగోస పడుతారని చెబుతున్నది. అలాంటి పరిస్థితి రావద్దని, ఆ పార్టీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వద్దని స్పష్టం చేస్తున్నది.
– రాజన్న సిరిసిల్ల, మే 30(నమస్తే తెలంగాణ)
దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న భూసమస్యలకు ధరణి పోర్టల్‌తో రాష్ట్ర సర్కారు చెక్‌పెట్టింది. సమైక్య పాలనలో చెప్పులరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిన ప్రజలకు పరిష్కారం చూపింది. దరఖాస్తు చేసుకున్న సత్వరమే ఇంటికొచ్చి పాసుబుక్కులు అందిస్తుండడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. రైతులకు రూపాయి ఖర్చులేకుండా తమ భూమి హక్కు పత్రాలు అందుతుండడంతో ధరణి పోర్టల్ ఎప్పటికీ ఉండాలని కోరుతున్నది
– రాజన్న సిరిసిల్ల, మే 30 (నమస్తే తెలంగాణ)
పాత వ్యవస్థలో అడుగడుగునా అవస్థలే..
ఒకప్పుడు భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి తిరిగి వేసారేది. రెవెన్యూ కార్యాలయానికి వెళ్తే అధికారులు పట్టించుకోకపోవడమే కాకుండా, కనీసం లోపలికి అడుగు పెట్టనిచ్చే వారు కాదు. పట్వారీ ఉంటే గిర్దావర్ ఉండడు.. వీరిద్దరూ ఉంటే తహసీల్దార్ ఉండడు. ఇలాంటి పరిస్థితిలో రైతులు దళారులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఎంతో కొంత ముట్టచెబితే కానీ హక్కు పత్రాలు అందకపోయేవి. పైగా సొంత భూమి ఎవరి పేరుమీదకు మారుతుందో తెలియని పరిస్థితి ఉండేది. పల్లెల్లో గెట్టు పంచాయితీలు పెరిగి ఇరువర్గాల మధ్య గొడవలకు దారితీసేవి. సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు నానుస్తూ తమ పబ్బం గడుపుకునేవారు. తాతలు, తండ్రులు కాలం చేస్తే వారి పేరిట ఉన్న భూమి కొడుకుల పేరిట మార్చుకోవాలన్నా ముప్పు తిప్పలు పడేది. దీనిని ఆసరాగా చేసుకుని అధికారులు చేతివాటం ప్రదర్శించేవారు. ఫలితంగా రెవెన్యూ వ్యవస్థలో అవినీతి పెరిగిపోయింది. ఇలా ఏండ్లకేండ్లుగా భూసమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. గతంలో ఓ మండల పరిధిలోని భూములు మరో మండల పరిధిలో ఉండి రిజిస్రేష్టన్లు చేయించుకోవాలన్నా.. పేరు మార్పిడి చేయించుకోవాలన్నా ఆ మండలానికి వెళ్లడానికి రైతులు చాలా ఇబ్బంది పడేది. వ్యవసాయ పనులు వదులుకుని రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది.
ధరణితో సమస్యలన్నింటికీ చెక్
రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ ‘ధరణి’ పోర్టల్ తీసుకొచ్చారు. 2020 అక్టోబర్ 29న అమలులోకి వచ్చిన ఈ పోర్టల్ రెవెన్యూ వ్యవస్థలో పెను మార్పులు తెచ్చింది. ‘ధరణి’ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న వెనువెంటనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తవుతున్నాయి. పాసుబుక్కుల కోసం రైతులు కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అధికారులు ఇంటికొచ్చే చేతిలో పెడుతున్నారు.
జిల్లాలో 38,400 రిజిస్ట్రేషన్లు
ధరణి పోర్టల్ ద్వారా రైతులకు సత్వర సేవలు అందుతున్నాయి. గతంలో పట్వారీ, గిర్దావర్, తహసీల్దార్ ఉంటేనే పాసుబుక్కు చేతికొచ్చేది. ధరణితో కేవలం తహసీల్దార్ అందుబాటులో ఉంటే చాలు వెంటనే పాసుబుక్కు వస్తున్నది. జిల్లాలో 2020 నవంబర్ నెలలో ధరణి సేవలు అందుబాటులోకి వచ్చాయి. రైతులు నేరుగా స్లాట్ బుకింగ్ చేసుకుంటూ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 38400 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. అందులో 37,218 పరిష్కారమయ్యాయి.
ఇంత జెల్ది అయితదనుకోలె
మా నాయిన మల్లయ్యకు నేను, తిరుపతి ఇద్దరం అన్నదమ్ములం. మా నాయిన చనిపోయి ఏడాదైతంది. ఆయన పేరిట ఉన్న రెండున్నరెకరాల భూమి మా అన్నదమ్ముల పేరిట పట్టా చేయించుకునేటందుకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చినం. ఏమీ తెలియని మాకు అధికారులే అన్ని వివరాలు చెప్పి దరఖాస్తు చేయించిన్రు. సంతకాలు తీసుకున్న తర్వాత పది నిమిషాలల్ల ఇద్దరన్నదమ్ముల పేరిట పాసు బుక్కు ఇచ్చిన్రు. చాలా సంతోషమనిపించింది. ఇంత జెల్ది మా పేరుమీద పట్టా దారు పాసు బుక్కు వత్తదనుకోలె. కేసీఆర్ సార్ రైతులకు ఇబ్బంది లేకుండజేత్తుండు. ఎన్ని సార్లు తిరగాల్నో అనుకున్నం. ధరణి జెయ్యవట్టే మాకు తొందరగ పనైంది.
రద్దు చేస్తే మళ్లీ దళారుల రాజ్యమొస్తది
ఒకప్పుడు తాతలు, తండ్రుల పేరుమీద ఉన్న భూములు వారసుల పేరుమీదకు మార్చుకోవాలంటే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరిసిల్లకు పోవాల్సి వస్తుండె. తీరా అక్కడికి పోయిన తర్వాత సార్లు లేరని వెళ్లగొట్టేది. ఇట్ల నెలలకొద్ది తిరిగిన రోజులున్నయ్. ఇలా తిరిగితే పని కాదని, ఆఫీసుల ముందుండే దళారులను పట్టుకుంటే పనై పోతుందని అటెండర్లు చెబుతుండె. వాళ్లకు కొంత ముట్టజెప్పితే కాని మా తాత పేరు మీదున్న భూమి మా నాయిన పేరుమీద కాలేదు. తెలంగాణ సర్కారు వచ్చినంక ధరణి తెచ్చింది. మొన్ననే మా గట్టు పక్కనున్న రైతు పొలం కొన్నడు. సాక్షి సంతకం పెట్టమని రమ్మంటే మా మండల తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లిన. అన్ని కాగితాలు చూసి సంతకాలు తీసుకున్నరు. పావుగంటల పాసుబుక్కు ఇచ్చిన్రు. నాటి రోజులు యాజ్జేసుకుని బాధపడ్డ. పైసలు ఖర్చయినయి. రోజుల తరబడి తిరిగినం. కేసీఆర్ సార్ తెచ్చిన ధరణి పుణ్యమా అని బాధలు తీరినయ్. దీన్ని రద్దు చేయాలంటూ కొన్ని పార్టీలోళ్లు లొల్లి లొల్లి చేస్తున్నరు. వాళ్లని నమ్మితే కథ మొదటికస్తది. ధరణిని రద్దు చేస్తే మళ్లీ దళారుల దందా మొదలైతది.
– బుర్రవేణి నాగరాజు, రాచర్ల బొప్పాపూర్, ఎల్లారెడ్డిపేట మండలం
మళ్లీ అవినీతి పెరుగుతది
మారుమూలలో ఉండే మా ఊరిలోని భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేయించుకోవాలన్నా ఒకప్పుడు 25 కిలోమీటర్ల దూరంల ఉన్న ఎల్లారెడ్డిపేటకు పోయేది. అంత దూరం పోవాలంటే ఎవుసం పని బంద్ పెట్టాల్సి వచ్చేది. పేరు మార్చుకోవాలంటే నెలలసంది ఆఫీసుల చుట్టూ తిరగాలని ఊరోళ్లంత జెప్పిండ్రు. దీంతో నేను ఎల్లారెడ్డిపేటకు పోలేదు. మా తాతల పేరుమీదున్న భూములన్నీ అట్లనే ఉండిపోయినయ్. ధరణి వచ్చినంక రెండు నెలల కింద మా మండలంలనే మా పేరుమీద భూములను బదలాయించుకున్న. పదినిమిషాల్లో కాగితాలు చేతికొచ్చినయ్. మా ఊళ్లె అందరూ పరేశానైన్రు. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలే. ధరణి బంద్ జెయ్యాలంటూ కాంగ్రెసోళ్లు లొల్లి జేస్తున్నరు. అట్లజేస్తే మళ్లీ పైరవీకారులు, దళారులు పుట్టకొస్తరు. గింత మంచి ధరణిని గిట్లనే నడిపించాలె.
– సామల్ల చిన్న పోచయ్య, కంచర్ల, వీర్నపల్లి మండలం
మా గోస తీరింది
నాకు నాలుగెకరాల భూమి ఉంది. రెండెకరాలకొక పాసు బుక్కు ఉండేది. ఒక్కటే పాసుబుక్కుల నాలుగెకరాలు ఎక్కించమని ఎనిమిదేండ్ల కింద ఆఫీసుకు పోయిన. పట్వారీ ఉంటే గిర్దావర్ ఉండడు.. ఆ ఇద్దరుంటే తహసీల్దార్ ఉండడు. ఇట్ల నాలుగేండ్లు ఆఫీసు చుట్టూ తిరిగిన. బండి ఖర్చులు, ఎవుసం పని దండుగైంది తప్ప పనికాలే. కేసీఆర్ సార్ సల్లంగుండ.. ధరణి తెచ్చిండు. దరఖాస్తు చేసుకున్నంక జాగ నాదా కాదా అని పరిశీలించిన్రు. తెల్లారి రమ్మన్నరు. సంతకాలు పెట్టిన వెంటనే బుక్కు చేతికిచ్చిన్రు. నాడు నాలుగేండ్లు తిరిగితే నేడు ఒక్కరోజులనే పనైంది. ధరణి వల్లనే మా గోస తీరింది. పట్వారీ, గిర్దావర్ల పనే లేదు. ఒక్క తహసీల్దార్ ఉంటే చాలు పనైపోతంది. ఇది ఇట్లనే నడిపించాలె. పైసా ఖర్చు అయితలేదు.
– గంగుల బాలయ్య, రైతు, ఇప్పలపల్లి, సిరిసిల్ల అర్బన్ మండలం
రైతులకు దన్నుగా నిలిచింది..
ధరణి వచ్చినంకనే 40 ఏండ్ల సమస్య పరిష్కారమైంది. గత ప్రభుత్వంలో చేయలేని పని ఈ కేసీఆర్ ప్రభుత్వం, ధరణి వల్ల సాధ్యమైంది. ఇలాంటి ధరణిని తీసివేయాలనే ఆలోచన ప్రతిపక్షాలకు రావడం చాలా దుర్మార్గం. మా తాతల పేరుమీదున్న భూమి మా పేరుపై రావడానికి దాదాపు 40 ఏండ్లు పట్టింది. నూకలమర్రిలో సర్వే నంబర్ 177ఈలో మా తాత సోమినేని బాలయ్య పేరు మీదున్న భూమిని మనువళ్లం చేసుకుందామనుకున్నం. గతంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా పరిష్కారం కాలే. ధరణి వచ్చినంక మా నలుగురు అన్నదమ్ములకు ఒక్కొక్కరికి 37 గుంటల భూమి వచ్చింది. రైతు బంధు పథకం కూడా రెండేండ్ల నుంచి తీసుకుంటున్నం. ప్రభుత్వం చేస్తున్న పనులను విమర్శించే ముందు గత ప్రభుత్వం ఏమి చేసిందో ఆలోచించాలి. ధరణిని మూసేస్తాం అనడం చాలా దారుణం. ఇలా చేస్తే మళ్లీ రైతులకు కష్టాలు వస్తయ్. ఇదిలానే ఉండాలి. ధరణి రైతులకు దన్నుగా ఉంటంది.
– సోమినేని బాలు, నూకలమర్రి (వేములవాడ రూరల్)
ధరణితో మాకు న్యాయమైంది
మా ఊరిలోని 196 సర్వేనెంబర్ల ఉన్న 18 గుంటల భూమిల మా నాయిన సాగు చేసిండు. ఆయన తర్వాత నేను ఏండ్ల నుంచి సాగుచేసుకుంటున్న. అయితే, నా భూమి మరొకరి పేరు మీదికి మారింది. ఎట్ల మారిందో తెల్వదు. మోఖా మీద మేమున్నమని, నా పేరు మీద మార్పు చెయ్యాలని మా నాయిన, నేను ఒకప్పుడు తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరిగినం. పోయినప్పుడల్లా దరఖాస్తు ఇయ్యమన్నరు. ‘నిన్ననే దరఖాస్తు ఇచ్చిన సార్’ అంటే మళ్లీ ఇయ్యమంటూ గోస పెట్టుకున్నరు. పొలం పని పక్కనవెట్టి పేరు మార్పిడి కోసం ఎన్నో పైసలు ఖర్చు పెట్టుకున్నం. అయినా కాలేదు. తెలంగాణ సర్కారు వచ్చినంక ధరణిల దరఖాస్తు పెట్టుకున్న. సార్లు ఎంక్వయిరీ చేసిన్రు. ఆఫీసుకు రమ్మన్నరు. పోయినంక నిమిషంల ప్రింటు తీసి పాసుబుక్కు ఇచ్చిన్రు. నయా పైసా ఖర్చు కాకుంట నా పేరు మీద మార్పిడైంది. సీఎం కేసీఆర్ సారు తెచ్చిన ధరణితోనే మాకు న్యాయమైంది.
– లింగంపల్లి సత్యనారాయణ, పెద్దూరు, సిరిసిల్ల అర్బన్ మండలం
పైరవీకారులు పత్తాలేకుంట పోయిన్రు
ధరణితోనే రైతులకు ధైర్యం వచ్చింది. తెలంగాణ వచ్చినంక మాలాంటి రైతులకు భూ సమస్యలు పరిష్కారమైనయ్. అంతకుముందు అధికారుల దగ్గరికి పోతే సతాయించేటోళ్లు. పైసలడిగెటోళ్లు. మా భూమి మాకు చేస్తరో లేదో అనే భయం ఉండేది. నకిలీ పట్టాలు వంటి సమస్యలతో నిద్రపట్టేది కాదు. నేను ఎకరం భూమిని ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్న. చాలా అలుకగ పనైంది. ఒక రోజు ముందు స్లాట్ బుక్ చేసుకున్న. ఎవరికి ఒక్క పైసా ఇయ్యలే. రిజిస్ట్రేషన్ కాంగనే పట్టా వచ్చింది. అవినీతికి బ్రేక్ పడింది. పైసా అదనపు ఖర్చు లేకుండా పోయింది. పైరవీకారులు పత్తాలేకుంటపోయిన్రు. ఇలాంటి మంచి ధరణిని ప్రతిపక్షాలు రద్దు చేయాలనడం అవివేకం. ఈ పోర్టల్ నిరంతరం కొనసాగాలి. ఒకవేళ రద్దు చేస్తే అవినీతి జరిగి, పైరవీలతో రైతులకు అన్యాయం జరుగుతది.
– జిల్లెల్ల పరశురాములు, రైతు, గంభీరావుపేట
ఎవరిసాయం లేకుండనే రిజిస్ట్రేషన్ చేసుకున్న
మా అమ్మ మానుక లక్ష్మి పేరు మీద వేములవాడ రూరల్ మండలం లింగంపల్లిల అరెకరం భూమి ఉన్నది. మా నాన్న చనిపోయిండు. మా అమ్మ ఒక్కతే ఉంటంది. ఆ భూమిని నా పేరు మీద చేసుకోడానికి మీ సేవల దరఖాస్తు చేసుకున్న. మా తల్లిని తోలుకొని ఇద్దరు మా చుట్టాలను సాక్ష్యంగా తీసుకొని తాసిల్దార్ ఆఫీసుకు వచ్చిన. మొదట మాదే ఉండడంతో తాసిల్దార్ సార్ పిలిచి వివరాలు అడిగిండు. వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని సిబ్బందికి చెప్తే పది నిమిషాల్లో చేసిన్రు. ఎవరి సాయం లేకుండనే ఐదు నిమిషాల్లోనే మా అమ్మ పేరు మీద ఉన్న భూమి నా పేరు మీదికి వచ్చింది. ఇంత తొందరగ అయితదనుకోలే. మేం అఫీస్‌కు వచ్చిన పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇంత తొందరగ అయ్యిందా సారు అని అంటే అయిపోయిందమ్మ.. పది రోజుల్లో మీ ఇంటికి పాస్‌బుక్ వస్తదని తాసిల్దార్ సారు చెప్పిండు. రిజిస్ట్రేషన్ అయినట్లు పేపర్ ఇచ్చిన్రు.
– బొల్లు లక్ష్మి, సుద్దాల, కోనరావుపేట మండలం