తాము అధికారంలోకి వస్తే ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాలు చేయడం భవిష్యత్‌లో ఉండదని, వారిని క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన కాంగ్రెస్, అధికారంలోకి రాగానే మాట మార్చింది. క్రమబద్ధీకరణ సంగతి దేవుడెరుగు, కనీసం వేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చూస్తున్నది. తొమ్మిది నెలలుగా వేతనాలు అందక ధరణి ఆపరేటర్లు అరిగోస పడుతున్నారు. అధికారులు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేక ఆవేదన చెందుతున్నారు. నిత్యం పనిచేయించుకోవడమే తప్ప తమకు వేతనాలు ఇచ్చే విషయంపై ఎవరూ దృష్టిపెట్టడం లేదని వాపోతున్నారు.
కరీంనగర్, జనవరి 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కలెక్టరేట్ : ఔట్సోర్సింగ్ విధానం (పొరుగు సేవల పద్ధతి)లో ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందిని కూడా కాంగ్రెస్ సర్కారు దగా చేస్తున్నది. రెవెన్యూ విభాగంలో అత్యంత కీలకమైన ధరణి సెక్షన్లో విధులు నిర్వర్తిస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చినా.. అమలులో నిర్లక్ష్యం చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేతనపెంపు దేవుడెరుగు కనీసం వేతనాలు కూడా సక్రమంగా పంపిణీ చేయడం లేదనే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి నెలా క్రమం తప్పకుండా చెల్లించాల్సింది పోయి.. తొమ్మిది నెలలైనా విడుదల చేయకపోవడంతో కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాలు చేయడం భవిష్యత్‌లో ఉండబోదంటూ, తాము అధికారంలోకి రాగానే క్రమబద్ధీకరిస్తామంటూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. భవిష్యత్‌లో తమకు క్రమబద్ధీకరణ జరిగి, ప్రభుత్వోద్యోగులం అవుతామనే ఆశతో నామమాత్రపు వేతనాలతో పనిచేస్తున్నా.. వాటిని కూడా చెల్లించడంలో తాత్సారం చేస్తుండడంతో ఆవేదనకు గురవుతున్నారు. తమ ఇళ్లలో పూట గడవడం కష్టంగా మారి, కుటుంబ పోషణ కోసం నానా అగచాట్లు పడుతున్నామని వాపోతున్నారు.
దీనికితోడు ఇన్నాళ్లూ ధరణి పోర్టల్ నిర్వహించిన ఈ సెంట్రిక్ సంస్థ ఒప్పంద గడువు ముగియడంతో ప్రస్తుతం పారాడిమ్ సంస్థ ఆధ్వర్యంలో వీరంతా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ధరణి పోర్టల్‌ను ఈనెల ఒకటి నుంచి నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగించడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. తమ వేతనాల సంగతి తేల్చాలంటూ అధికారులను అర్థిస్తున్నా పట్టించుకునే లేరని వాపోతున్నారు. ఎవరికివారే తమకేమీ తెలియదంటూ అధికారులు చేతులెత్తేస్తుండగా, కొత్త ఏజెన్సీ తమకు రావాల్సిన పాత వేతనాల పంపిణీపై స్పందిస్తుందో..? లేదోనని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది కుటుంబాలు వీధిన పడుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనలో కుటుంబాలు
ఉమ్మడి పాలనలో భూకబ్జాలు, ఆక్రమణలు, అక్రమ పట్టాలతో వివాదాలకు కారణమవుతున్న పట్టా, ప్రభుత్వ భూమిని పక్కాగా పర్యవేక్షించేందుకు వీలుగా స్వరాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ భూ యజమానుల వివరాలన్నీ సేకరించి, వాటిని ధరణి పోర్టల్‌లో నిక్షిప్తం చేసిన విషయం తెలిసిందే. అప్పుడు భూలావాదేవీలు, క్రయవిక్రయాలు వంటి వాటి కోసం పనులు చేసేందుకు తహసీల్ ఆఫీస్ పరిధిలో ఔట్సోర్సింగ్ విధానంలో కొంతమంది సిబ్బందిని ఏజెన్సీ సాయంతో నియమించారు. వీరిలో ప్రధానంగా ఆపరేటర్లు, కోఆర్డినేటర్లు, బఫర్లు ఉండగా, వీరంతా ప్రతి మండలంలోని తహసీల్ ఆఫీసుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
వీరికి వేతనంతోపాటు ఇతర సౌకర్యాలన్నీ టెరాసిస్ ఏజెన్సీ కల్పించేది. నెలనెలా క్రమం తప్పకుండా ఆపరేటర్లు, బఫర్లకు 11 వేల వరకు, కోఆర్డినేటర్లకు 13 వేల వరకు వేతనం ఇచ్చేవారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారి వేతనాలు నిలిచిపోయాయి. అంతకుముందే ఔట్సోర్సింగ్ ఏజెన్సీ గడువు కూడా ముగియడంతో తిరిగి పునరుద్ధరించలేదు. ఈ సెంట్రిక్ సంస్థ తాత్కాలికంగా ఏజెన్సీ నిర్వహించింది. వీరి హాజరు పట్టిక ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపింది. అయినా, బడ్జెట్ సాకుతో వేతనాలు విడుదల చేయలేదని తెలుస్తున్నది. అయితే, ముందుగా ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులరైజ్ చేస్తారనే ఆశతో ధరణి పోర్టల్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.
జనవరి నుంచి ఈ పోర్టల్ నిర్వహణ బాధ్యతలు రాష్ట్ర సర్కారు ఎన్ఐసీకి అప్పగించింది. దీంతో తమకు రావాల్సిన పాత వేతనాలపై అధికారుల వద్ద పట్టుబట్టుతున్నా స్పందించడంలేదని తెలుస్తున్నది. జవవరి వేతనం ఫిబ్రవరిలో విడుదల చేయగా, ఫిబ్రవరి వేతనం మాత్రం గత నెలలో విడుదల చేశారని ధరణి సిబ్బంది వాపోతున్నారు. వేతనాల కోసం సదరు ఆపరేటర్లు కలువని అధికారి లేడని, కాళ్లరిగేలా తిరగడంతో ఒకనెల వేతనం మాత్రమే అందించారని చెబుతున్నారు. వేతనాలందక తమ కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతుండడంతో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వేతనాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇచ్చేది నామమాత్రపు వేతనం, అది కూడా సక్రమంగా విడుదల చేయకపోవడం సమంజసం కాదని రెవెన్యూ వర్గాల్లోని కొన్ని సంఘాలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ యేడాది ఒకటి నుంచి కొత్త ఏజెన్సీకి పోర్టల్ నిర్వహణ అప్పగించగా, వారి పెండింగ్ వేతనాలపై స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని, ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళన తొలగించాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.