రాంనగర్, డిసెంబర్ 22 : భరోసా కేంద్రాలు మహిళలకు అండగా ఉంటాయని డీజీపీ డాక్టర్ జితేందర్ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో కరీంనగర్ కమిషనరేట్ కోసం కొత్తపల్లి వద్ద భరోసా కేంద్ర నూతన భవనాన్ని శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. అంతకు ముందు ఆయనకు సీపీ అభిషేక్ మొహంతి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం భరోసా కేంద్రం వద్ద నూతన పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత బాధిత మహిళలకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన గదులు, వసతులు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కేంద్రంలో సోమవారం నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని కమిషనరేట్లు, జిల్లాల్లో భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ రాష్ట్రంలో నక్సలిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, సినీ ప్రముఖులు అల్లు అర్జున్ మోహన్‌బాబు విషయాల్లో చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ రేమా రాజేశ్వరి, ట్రైనీ ఐపీఎస్ యాదవ్ వసుంధర ఫౌరెబి, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ మాధవి, ఇన్స్పెక్టర్ శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.