పెద్దపల్లి, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ‘70 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదు. కానీ, గడిచిన తొమ్మిదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి పరుగులు పెట్టింది. మళ్లీ కారును గెలిపిస్తేనే రాష్ట్రంలో, మంథనిలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. దీనిని ప్రజలు గుర్తించారు. అందుకే నా ప్రజా ఆశీర్వాద యాత్రకు బ్రహ్మరథం పట్టారు. ఎక్కడికి వెళ్లినా ఆశీర్వాదం తెలిపారు’ అని మంథని బీఆర్ఎస్ అభ్యర్థి, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ చెప్పారు. ఆయన ప్రజా ఆశీర్వాద యాత్ర గురువారం ముగిసిన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కాంగ్రెస్ కుట్రలను ఎండగడుతూనే.. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరించారు. గత నెల 25న ముత్తారంలో యాత్ర చేపట్టానని, ప్రజల ఆదరాభిమానాలతో అడుగులో అడుగు వేసుకుంటూ తెలియకుండానే 11 రోజులపాటు పాదయాత్ర చేశానని చెప్పారు. తొమ్మిది మండలాల్లోని 97 గ్రామాల్లో ప్రతి గడపనూ తడుతూ.. 311 కిలోమీటర్లు నడిచి, గురువారం ముగించానన్నారు. ఆరోగ్యం సహకరించకున్నా.. అస్వస్థతకు గురైనా అడుగడుగునా ప్రజల ప్రేమాభిమానాలే నన్ను పల్లెపల్లెకూ, గడపగడపకూ నడిపించాయన్నారు.
పుట్ట మధూకర్: నేను అధికారంలో ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల మధ్యే ఉన్నా. నాకు పదవులు ప్రధానం కాదు, ప్రజలే ప్రధానం. వాళ్ల ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నా. అందుకే నేను ప్రజా ఆశీర్వాద యాత్రకు శ్రీకారం చుట్టా. గత నెల 25న ముత్తారం మండల కేంద్రం నుంచి ప్రారంభించాం. మల్హర్, కాటారం, మహాముత్తా రం, పలిమెల, మహాదేవపూర్, కాటారం, మంథ ని, రామగిరి, కమాన్పూర్, రామగిరి మండలాల్లోని 97 గ్రామాల్లో ప్రతి గడపకూ వెళ్లా. మొత్తం తొమ్మిది మండలాల్లో 311 కిలోమీటర్లు నడిచా. గురువారం మంథనిలో యాత్రను ముగించా.
పుట్ట మధూకర్: నేను బీఆర్ఎస్ అభ్యర్థిని కావడమే నా అదృష్టం. పార్టీ ఇచ్చిన అవకాశంతోనే ప్రజలు నన్ను సొంత బిడ్డలా ఆదరించారు. రాష్ట్రం లో, మంథనిలో కారును గెలిపిస్తేనే మరింత అభివృద్ధి సాధ్యం అనే విషయాన్ని గుర్తించారు. అందుకే నా యాత్రకు ఆశీర్వాదం తెలిపారు. అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. నా ఆరోగ్యం సహకరించకపోయినా.. అస్వస్థతకు గురైనా.. ప్రజల ప్రేమాభిమానాలతోనే పల్లెపల్లెకూ వెళ్లా. గడపగడపనూ తట్టా.
పుట్ట మధూకర్: మంథని నియోజకవర్గంలో ప్రతిపక్షాల తీరు విచిత్రంగా ఉన్నది. మంచిని స్వీకరించే పరిస్థితుల్లో ఆ పార్టీలు లేవు. ప్రతి విషయంలో బట్టకాల్చి మీద వేయడమే పనిగా పెట్టుకున్నాయి. అంతే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవు. కాంగ్రెస్ అయితే మరి మోసకారిగా తయారైంది. ఇక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ ఉండడు. ఆయనకు పదవులు కావాలే తప్ప ప్రజా సేవ అవసరం లేదు. హైదరాబాద్లో ఉండి రాజకీయాలు నడిపించుడే తప్ప ఒక్క పని చేయడు. ఒక బీసీ బిడ్డగా ఎదిగిన నన్ను రాజకీయంగా ఎలా సమాధి చేయాలనే లక్ష్యంతో కొంత మందికి నెల నెలా జీతాలు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నాడు. నిరంతరం కుట్రలు, కుతంత్రాలతో నన్ను నా కుటుంబాన్ని మానసికంగా హింసిస్తూనే ఉన్నాడు.
పుట్ట మధూకర్: మంథని నియోజకవర్గంలో ఇప్పటి వరకు పదకొండు సార్లు ఎన్నికలు జరిగాయి. పది సార్లు కాంగ్రెస్ నుంచి ఒకే ఒక్క సామాజిక వర్గానికి, ఎనిమిది సార్లు ఒకే కుటుంబానికి టికెట్లు దక్కాయి. వారే ఈ మంథని నియోజకవర్గాన్ని ఎక్కువకాలం పాలించారు. కానీ, ఇక్కడ చేసిందేమీ లేదు. అదే 2014లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత 2019లో ఓటమి పాలైనా సీఎం కేసీఆర్ జడ్పీ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. ఈ తొమ్మిదిన్నర ఏండ్లల్లో ఎంతో అభివృద్ధి చేశాం. ఇది మంథని నియోజకవర్గం ఏర్పాటు తర్వాత జరిగిన అభివృద్ధితో పోలిస్తే నూరు రెట్లు ఎక్కువ. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించారు. అభివృద్ధికి ఈ ఎన్నికల్లో తప్పక పట్టం కడుతారు.
పుట్ట మధూకర్ : నేను ఇక్కడే పుట్టా. ఇక్కడే పెరిగా. చివరి వరకూ ఇక్కడే ఉంటా. నా జీవం.. నా ప్రాణం ఇక్కడి ప్రజలతోనే. మంథని నియోజకవర్గ ప్రజలతో నాకున్నది ఓటు సంబంధం కాదు, పేగు బంధం. రక్త సంబంధం. ఎన్నికలు, ఓట్లతో సంబంధం లేకుండా అందుబాటులో ఉంటా. వారి కష్టాలు, కన్నీళ్లల్లో భాగమవుతా. ప్రతీ పేద కుటుంబానికి ఇళ్లు ఉండాలనేది సీఎం కేసీఆర్ సంకల్పం. అది నెరవేర్చడానికి ఏడాదికి పది వేల ఇండ్లు కట్టించే విధంగా నేను పని చేస్తా. గృహలక్ష్మి కింద ఇండ్లు కట్టుకునే వారికి సాయం అందిస్తా. గృహ ప్రవేశానికి నేను నా భార్య వెళ్లి బట్టలు పెట్టి వస్తా. ఇక్కడి పేద కుటుంబాల బిడ్డలకు ఉన్నత చదవులు భారమవుతున్నాయి. అలాంటి వారి కోసం హైదరాబాద్లో ప్రత్యేకంగా హాస్టళ్లు పెట్టి, నా సొంత ఖర్చులతో వారికి వసతి కల్పిస్తా. విదేశాలకు వెళ్లే పేద బిడ్డలకు నేనే షూరిటీ ఇచ్చి, పంపిస్తా. ఇప్పటికే 12మందిని విదేశాలకు పంపించా.
పుట్ట మధూకర్: 70 ఏండ్ల కాంగ్రెస్ చీకటి పాలన ఒకవైపు, తొమ్మిదిన్నరేండ్ల అభివృద్ధి, సంక్షేమ పాలన మరో వైపు ఉన్నది. ప్రజలు మోసపూరిత మాటలను నమ్మకుండా వివేకంతో వ్యవహరించాలి. మీరు ఒక్క రోజు నాకు కేటాయించి ఓటేయ్యండి. ఐదేండ్లు నేను, నా కుటుంబం మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి. గెలిచిన తర్వాత హైదరాబాద్లో ఉండే అప్ అండ్ డౌన్ ఎమ్మెల్యేను కాదు. నిత్యం మీతోనే ఉండే మీ అన్నను, తమ్ముడిని. నేను పాలకుడిని కాదు, మీ సేవకుడిని. బీఆర్ఎస్కు ఓటేయండి. అభివృద్ధికి పట్టం కట్టండి. ఎమ్మెల్యేగా నాకు మరోసారి అవకాశం ఇవ్వండి. మూడోసారి కేసీఆర్ను సీఎం చేయండి.