MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, నవంబర్ 12 : కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలకు మంజూరైన రూ.37.40 కోట్ల యూఐడీఎఫ్ అభివృద్ధి నిధులను అధికారులు ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో కోరుట్ల, మెట్పల్లి మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి నిధులతో చేపట్టనున్న పురోగతి పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలకు ప్రభుత్వం యూఐడీఎఫ్ పథకం రూ.37.40 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. రెండు పట్టణాల్లో రహదారుల అధునీకరణ, డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మాణం ఇతర మౌళిక సదుపాయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని సూచించారు. పనుల్లో అలసత్వం చూపవద్దన్నారు. అమృత్ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన తాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు.
పట్టణాల అభివృద్ధి, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల మెరుగుదలను దృష్టిలో ఉంచుకొని పనులు సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు రవీందర్, మోహన్, డీఈఈలు, పట్టణ ప్రణాళిక అధికారులు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్ వార్డు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.