MLA CH Vijayaramana Rao | పెద్దపల్లి రూరల్, ఆగస్టు 22 : పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి, రాగినేడు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బ్రాహ్మణపల్లిలో రూ.55 లక్షలు, రాగినేడులో రూ.70 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి పనులు ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులు, పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని అన్నారు.
దేశంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సగర్వంగా చాటి చెప్పారు. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేశామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు బోనస్ చెల్లించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తామని పేర్కొన్నారు. జిల్లాలో 9 సంఘ సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున రూ.90 లక్షలు భీమా సొమ్ము చెల్లించాలని, మరో 50 మందికిపైగా మహిళలకు రూ.2 లక్షల చొప్పున రుణమాఫీ చేశామన్నారు. బ్రాహ్మణపల్లిలో మహిళా సంఘం భవన నిర్మాణం, స్మశాన వాటిక, నల్లపోశమ్మ దేవాలయం వరకు సీసీ రోడ్డు, బ్రాహ్మణపల్లి నుండి అందుగులపల్లి వరకు బిటి రోడ్డు నిర్మాణం పనులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
అర్హులైన అందరికి రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని, ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు ఝాన్సీ, సంతోష్ రెడ్డి, మార్కెట్ చైర్ పర్సన్ ఈర్లస్వరూప సురేందర్, సింగిల్ విండో చర్మన్ చింతపండు సంపత్, నాయకులు యేడెల్లి శంకరయ్య, ఎలగందుల ప్రదీప్, కలబోయిన మహేందర్, గుమ్మడి విజయ్, పరమేష్, తోడేటి స్వప్న తిరుపతి, పడాల వీరన్న గౌడ్ , నాగపురి తిరుపతి, సోమచంద్రయ్య, పుప్పాల నిర్మల శ్రీనివాస్, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.