Sunke Ravishankar | గంగాధర, మే 20: మట్టి మాఫియా చేతిలో చొప్పదండి నియోజకవర్గం లోని చెరువులు విధ్వంసానికి గురవుతున్నాయని, అధికార పార్టీ అండదండలు, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో అక్రమార్కులకు ఆడిందే ఆట.. పాడింది పాటగా సాగుతోందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగాధర మండలం కురిక్యాల ఊర చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపిన ప్రదేశాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు, గంగాధర, చొప్పదండి, బోయినిపల్లి మండలలాల్లో నీటి వనరుల సంరక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులను సంరక్షించాల్సిన ఇరిగేషన్, మైనింగ్ శాఖల ఆధికారులే అక్రమ మట్టి తవ్వకాలకు అనుమతులు ఇస్తూ మట్టి మాఫియా కు సహకరిస్తుండడంతో చెరువులు రూపురేఖలు కోల్పోతున్నాయని పేర్కొన్నారు.
ధనార్జనే ధ్యేయంగా మట్టి మాఫియా చెరువులను విధ్వంసం చేస్తుంటే, అధికారులు చోద్యం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అధికారుల అండదండలతో మట్టి తవ్వకాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అనుమతులకు మించి తవ్వకాలు చేస్తున్నారని స్థానిక కాంగ్రెస్ నాయకుడే లారీలను అడ్డుకున్నాడని గుర్తు చేశారు. సంబంధిత శాఖ అధికారులు తక్షణమే అక్రమ అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్ రావు, నాయకులు కంకణాల విజేందర్ రెడ్డి, రామిడి సురేందర్, ఉప్పుల గంగాధర్, గడ్డం స్వామి, మామిడిపల్లి అఖిల్, బొల్లాడి అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.