Dharmapuri | ధర్మపురి, జనవరి 01: ధర్మపురి పట్టణశివారులోని కమలాపూర్ రోడ్డు వైపు గల ఖబ్రస్థాన్లో పవిత్ర సమాధులను ధ్వంసం చేయడం పట్ల ముస్లీం మతపెద్దలు తీవ్రంగా మండిపడ్డారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంలో భాగంగా విద్యుత్ శాఖ సిబ్బంది కమలాపూర్ రోడ్డు వైపు గల ఖబ్రస్థాన్లో పూర్వకాలంలో మతపెద్ద గా పేరుగాంచిన హుస్సేన్ షావలి యొక్క సమాధిని పూర్తిగా ధ్వంసం చేసి పక్కన్నే ఉన్న గోరిల్లా వాగులో పడేశారు. అలాగే అక్కడ ఉన్న చెట్లను నరికివేశారు. విషయం తెలుసుకున్న ముస్లీంలు మతపెద్దలతో పాటు దాదాపు 200 మంది అక్కడకు చేరుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముస్లీం మతపెద్దలుగా ఎందరికో మార్గదర్శనం చేసి మృతిచెందిన వారి ఆత్మగౌరవాన్ని తొక్కేలా జరిగిన ఈ ఘటన మత విద్వేషాలకు దారితీసే ప్రమాదమున్నదని హెచ్చరించారు. తక్షణమే బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖబ్రస్థాన్లకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం, అధికారయంత్రాంగం పూర్తిగా విఫలమైందని ముస్లీం నాయకులు విమర్శించారు. కాగా ఈ విషయంలో అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకుని ఇరువర్గాలతో చర్చించి సమస్యను సద్దుమనిగేలా చేసినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో మతపెద్దలు అఫ్జల్, యూనుస్, సయ్యద్ ఆసీఫ్, యూసుఫ్, ఇస్మాయిల్, రఫియోద్దీన్, షబ్బీర్, షోకత్, ఇంత్యాజ్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.