కలెక్టరేట్, మార్చి 12 : ఎండల మూలంగా రాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్య ముందుగానే మొదలైంది. దీనిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తమ ప్రభుత్వం చేపడుతోంది. గ్రామాలు, పట్టణాల్లో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ పనులు ప్రారంభిస్తున్నామంటూ, ప్రభుత్వ పెద్దలు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. కానీ నిధుల విదిలింపులో మాత్రం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ వేసవిలో జిల్లావ్యాప్తంగా తాగునీటి ముప్పు ముంచుకొస్తున్నా పట్టనట్లు వ్యవహరిస్తుండటం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతుంది. వేసవికి ముందు ఏటా చేపట్టినట్లుగానే ఈసారి కూడా జిల్లాలోని బోర్లు, చేతిపంపులు, మోటార్ల మరమ్మతుల కోసం అవసరమయ్యే నిధుల మొత్తానికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించి, అధికారులు ప్రభుత్వానికి పంపి, పక్షం రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని తెలుస్తోంది.
జిల్లాలో 2,632 హ్యాండ్ పంపులు ఉండగ వీటిలో సుమారు 500, 1771 సింగల్ ఫేజ్ బోర్ మోటార్లు ఉండగా 300 వరకు, 350 ఓపెన్ వెల్ మోటారులుంటే 30 వరకు పనిచేయటం లేదని అధికారుల ద్వారా తెలుస్తుంది. వెట్టి మరమ్మతుల కోసం రూ.41.86 లక్షలు అవసరమవుతాయనే అంచనాలతో అధికారులు నివేదిక పంపారు. ఈసారి ముందుగానే ఎండలు దంచికొడుతుండగా, శరవేగంగా భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సత్వరమే స్పందించి, అధికారుల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయాల్సి ఉండగా పట్టించుకోకపోవడంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం యంత్రాంగంలో ఆందోళన మొదలైంది.
వాస్తవానికి వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు రూపొందించి, జనవరి నెల నుంచే అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సి ఉంటుంది.
కానీ, అధికారులే అప్రమత్తమై మరమ్మత్తుల కోసం అంచనా నివేదికలు అందజేసినా, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపట్ల గ్రామాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అటు అధికారులపై ఇటు ప్రభుత్వంపై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పంచాయతీల్లో పాలకవర్గాలు పనిచేసిన సందర్భంలో ఆయా గ్రామాల సర్పంచులు బాధ్యతలు తీసుకొని, నీటి సరఫరా దృష్టి సారించేవారు. అవసరమైన మరమ్మతులకు కూడా సొంతంగా నిధులు వెచ్చించి అనంతరం తిరిగి తీసుకునే వారు. వారి పదవీకాలం ముగియడంతో తిరిగి ఎన్నికలు జరగక ప్రస్తుతం పంచాయతీలన్నీ ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. అధికారులు తమ జేబుల్లోంచి నిధులు వెచ్చించి, మరమ్మతులు చేపట్టే అవకాశాలు లేకపోగా, వేసవి ఆరంభంలోనే గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రమవుతోంది.
ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, ఈ నెలాఖరులోపే ప్రజలు ఖాళీ బిందెలతో వీధుల్లో కొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లాలో రోజురోజుకు నీటి ఎద్దడి తీవ్రమవుతున్న నేపథ్యంలో గత బీఆర్ఎస్ పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో తాగు, సాగునీటికి ఢోకా లేకుండా ఉండేదనే వ్యాఖ్యలు చేస్తున్నారు. తాగునీటి కోసం గ్రామాల్లో నీటి వనరుల నిర్వహణ కోసం అవసరమైన నిధులను ప్రతి ఏటా డిసెంబర్ లోనే విడుదల చేశేవారు. దీంతో వేసవికి ముందే నీటి ఎద్దడి నివారణ చర్యలతో, అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండేది. ఫలితంగా గత దశాబ్ద కాలంలో జిల్లాలోని గ్రామాల్లో ఏనాడు కూడా తాగు నీటి సమస్య ఉత్పన్నం కాలేదనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి.