వేములవాడ, జూన్ 16 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అభయ హస్తంలో ఇచ్చిన హామీలో భాగంగా ముదిరాజ్‌లకు చెరువులు, కుంటలు, గుట్టలపై హక్కులు కల్పించాలని ముదిరాజ్ రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ కోరారు. ఆదివారం వేములవాడ పట్టణంలో ముదిరాజ్‌లు నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ నెల చివరి వారం నుంచి రాష్ట్రంలోని అన్ని మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రం అందజేయాలని ముదిరాజ్‌లకు సూచించినట్లు చెప్పారు.
రాష్ట్రంలోనే అతి పెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధిలో ముదిరాజ్‌ల కోసం నిత్యాన్నదాన సత్రాన్ని నిర్మిస్తామని బండ ప్రకాశ్ తెలిపారు. వేములవాడలో ఇప్పటికే అనేక కుల సంఘాల నిత్యాన్నదాన సత్రాలున్నాయని, తా ము కూడా 150 గదులతో సత్రం నిర్మించేందు కు కమిటీని వేసుకున్నామని తెలిపారు. స్థలాన్ని సమకూర్చుకుని రాజన్న సన్నిధికి వచ్చే కుల బాంధవులకు సేవలందించేందుకు కార్యచరణ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యాక్రమం లో రాష్ట్ర ముదిరాజ్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు పండుగ బాలు, జిల్లా అధ్యక్షుడు కోడి అంత య్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్తయ్య, వెంకట్, ము దిరాజ్ సంఘం అధ్యక్షుడు లాల లక్ష్మీరాజం, పి ల్లి మధు, నాయకులు శ్రీనివాస్, దేవేందర్, మారుతి, మోహన్, రాజు, రాములు పాల్గొన్నారు.