Korukanti Chandar | కోల్ సిటీ . జూన్ 27: గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని పోచమ్మ మైదానంలో నగర పాలక సంస్థ అధికారులు ఇటీవల దుకాణాలను అనుమతి లేవని కూల్చివేసిన ఘటనపై రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ నిప్పులు చెరిగారు. నెల రోజులుగా నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు ఎక్కడికి పోయారని ధ్వజమెత్తారు. కట్టుకోమని చెప్పేది కాంగ్రె నాయకులే.. కూల్చమని చెప్పేది వారే.. ఇచెక్కడి రాక్షస పాలన.. వ్యాపారుల జీవితాలతో చెలగాటం ఆడటం మీకు నవ్వులాటగా ఉందా..? అసలు కార్పొరేషన్ అధికారులు స్వయం ప్రతిపత్తి కోల్పోయారా..? అంటూ ప్రశ్నించారు.
ఈమేరకు శుక్రవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి ముందుగా చౌరస్తాలో కూల్చివేతల స్థలంను సందర్శించి. పరిశీలించారు. బాధితులను కలిసి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయంకు చేరుకొని డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామిని ప్రశ్నించారు. అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై ఆగ్రహోదగ్రులయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి క్వార్టర్ల ప్రక్కన దుకాణాల కూల్చివేతకు సహకరిస్తే మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి పోచమ్మ మైదానంలోని ఖాళీ స్థలంలో షాపులు నిర్మించుకోమని చెప్పినందునే బాధితులు అక్కడ 12 దుకాణాలు నిర్మించుకున్నట్లు చెబుతున్నారని పేర్కొన్నారు. ఒక్కొక్కరు రూ. లక్ష దాకా ఖర్చు చేసి నెల రోజులుగా నిర్మాణాలు జరుగుతుంటే కార్పొరేషన్ అధికారులు చోద్యం చూసి, తీరా నిర్మాణాలు పూర్తయ్యాక నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి వ్యాపారులను రోడ్లపై పడేయడం దారుణమన్నారు. కాంగ్రెస్ నాయకులు కట్టుకోమని చెబుతూనే మరోవైపు అధికారులతో కూల్చివేయించడం క్షమించరాని నేరమన్నారు. బాధితులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అక్కడ నిర్మాణాలకు ప్రోత్సహించిన మాజీ కార్పొరేటర్ పైన చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్తున్నట్లు తెలిపారు. అధికారులు ఇకనైనా స్వయం ప్రతిపత్తితో బాధ్యతగా పని చేయాలని సూచించారు. ఇక కాంగ్రెస్ పార్టీ విధ్వంసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్, నారాయణ దాసు మారుతి, అచ్చవేణు, కృష్ణవేణి, జేవీ రాజు, ఐత శ్రీనివాస్, బొడ్డుపల్లి శ్రీను, సట్టు శ్రీనివాస్, దొమ్మేటి వాసు, తోట వేణు, రామకృష్ణ, వెంకన్న, ఆవునూరి వెంకటేష్, ఇరుగురాల శ్రావణ్, కిరణ్, తిమోతి తదితరులు పాల్గొన్నారు.