బోయినపల్లి రూరల్, జూన్ 21 : బీఆర్ఎస్ హయాంలో గోదావరి జలాలతో కళకళలాడిన శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మిడ్‌మానేరు) నేడు కాంగ్రెస్ సర్కారు వైఫల్యంతో ఎడారిలా మారిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. తెలంగాణకే గుండెకాయ లాంటి మిడ్‌మానేరు జలాశయం పూర్తిగా ఎండిపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. తొలి సీఎం కేఆర్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతాంగానికి సాగునీరు అందిస్తే.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయాయని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం చొప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదివారం శ్రీ రాజరాజేశ్వర (మిడ్‌మానేర్) జలాశయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా సుంకె మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడే ప్రమాదం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్లను వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని ఎత్తిపోసి చెరువులు, కుంటలు నింపాలని కోరారు. లేదంటే రైతుల పరిస్థితి దయనీయంగా మారుతుందని హెచ్చరించారు. రైతులను ఆదుకోవాలంటే వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులతో కలిసి ఎడారిలా మారిన మానేరులో కబడ్డీ, క్రికెట్ ఆడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ లెంకల సత్యనారాయణరెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ కొంకటి నాగయ్య, కో ఆప్షన్ మాజీ సభ్యుడు మహమ్మద్ అజ్జు, మండల ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, సర్పంచులు అనుముల భాసర్, కట్ట గోవర్ధన్, నాయకులు నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి, కొంకటి శేఖర్, చిందం రమేశ్, అకనపల్లి కరుణాకర్, కమల్‌గౌడ్, కన్నం సాగర్, ముద్దం రవి, నందయ్య, మల్లారెడ్డి, బోయిని రాజు, గురజాల కోటి, నాగుల శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మిరెడ్డి, మండల నాయకులు, పాల్గొన్నారు.