కొత్తపల్లి, సెప్టెంబర్ 1 : ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్లు కదం తొక్కాయి. సీపీఎస్‌ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, పోరుబాట పట్టాయి. టీజేఏసీ ఆధ్వర్యంలో సోమవారం (సెప్టెంబర్ 1వ తేదీని) పెన్షన్ విద్రోహ దినంగా నిర్వహించాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఆందోళనకు దిగాయి.
ఆయా జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నల్ల దుస్తులు, బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపాయి. మూడున్నర దశాబ్దాల పాటు ప్రజాసేవ చేసే ఉద్యోగులకు విరమణ అనంతరం వృద్ధాప్యంలో అందించే పెన్షన్ భిక్ష కాదని, అది ఉద్యోగుల హక్కు అని నినదించాయి. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకా రం ఓపీఎస్‌ను అమలు చేయాలని, లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించాయి.