శాతవాహన యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ అడ్మిషన్ల జోరు తగ్గడంతో పలు కళాశాలల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. యూనివర్సిటీ స్థాయిలో దాదాపు 80 వరకు ప్రైవేటు కళాశాలలు ఉండగా, పదుల సంఖ్యలో కళాశాలలకు అదే పదుల సంఖ్యలో అడ్మిషన్లు వచ్చినట్టు తెలుస్తున్నది. అయితే, సాంకేతిక విద్యకు ఆదరణ పెరడంతో డిగ్రీ విద్యకు తగ్గుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ కమాన్చౌరస్తా, ఆగస్టు 16 : డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గుతూ వస్తున్నాయి. డిగ్రీ ప్రవేశాల్లో శాతవాహన యూనివర్సిటీ పరిధిలో 2021-22లో 26,166 అడ్మిషన్లు రాగా, 2022-23లో 20,218 అడ్మిషన్లు, 2023-24లో 16,419 అడ్మిషన్లు వచ్చాయి. ఈ సంఖ్య ఈ యేడాది మరింత తగ్గి 15,950కు పడిపోయాయి.
డిగ్రీ ప్రవేశాల్లో విద్యార్థులను ఆకట్టుకున్న కళాశాలలకే అడ్మిషన్లు వస్తున్నట్లు తెలుస్తున్నది. అడ్మిషన్ల సమయంలో కొన్ని ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులను ప్రలోభాలకు గురిచేసి అడ్మిషన్లు తీసుకువచ్చుకుంటే, మరికొన్ని కళాశాలలు నిర్వహణ భారమై వాటి జోలికి పోలేదు. దీంతో ఆ కళాశాలలకు అడ్మిషన్లు పూర్తిగా తగ్గినట్టు తెలుస్తున్నది. అలాగే, పలు ప్రభుత్వ కళాశాలలకు కూడా అడ్మిషన్ల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. అయితే, తక్కువ అడ్మిషన్లు వచ్చిన కళాశాలలో కోర్సును బట్టి సీట్లను మరో కళాశాలలో ఉన్న కోర్సులతో కలుపుతారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలల్లో ఫీజులు విద్యార్థుల నుంచి తీసుకోకుండా, విద్యార్థులకు వచ్చిన స్కాలర్షిప్లను ఫీజులుగా తీసుకుంటూ కళాశాలలను నెట్టుకొస్తున్నారు. అయితే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కాలర్షిప్ నగదు ఇంకా విడుదల కాకపోగా, వాటి గురించి ప్రభుత్వం మాట్లాడకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో కళాశాలల యాజమాన్య సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహారు వేం నరేందర్రెడ్డి ద్వారా ముఖ్యమంత్రికి సైతం వినతి పత్రం సమర్పించినట్లు తెలుస్తున్నది.