కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 21 : తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంతో కీలకమైన దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఈ సారి కరీంనగర్‌లోనే నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు గురువారం కరీంనగర్ పరిధిలోని అల్గునూర్ చౌరస్తా, సుభాష్‌నగర్‌లోని పలు స్థలాలను బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ సునీల్‌రావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి పెట్టింది పేరు కరీంనగర్ జిల్లా అని స్పష్టం చేశారు. కేసీఆర్ ఉద్యమాన్ని కరీంనగర్ నుంచి చేపట్టారని, తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్ నుంచి ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో’ అన్న నినాదంతో ప్రారంభించారని గుర్తు చేశారు.
2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష కోసం వెళ్తుండగా అల్గునూర్ చౌరస్తాలో అరెస్టు చేయడంతో ఉద్యమం ఉవ్వెత్తున్న లేచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందన్నారు. ఈ రోజును తాము దీక్షా దివస్‌గా ప్రకటించుకున్నామని, ఈ దినోత్సవాన్ని కరీంనగర్‌లోనే నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని చెప్పారు. దీని కోసం స్థలాలను పరిశీలించామని, సుభాష్నగర్తోపాటు అల్గునూర్ చౌరస్తాల వివరాలను అధిష్టానానికి పంపిస్తామని తెలిపారు. పార్టీ నిర్ణయించిన తర్వాత ఏర్పాట్లు ప్రారంభిస్తామన్నారు. ఈ దీక్షా దివస్‌ను తెలంగాణకు చెందిన కవులు, కళాకారులు, ఉద్యమకారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు, మహిళలు, తదితరులతో గొప్పగా నిర్వహిస్తామని తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, నక పద్మ కృష్ణ, నాంపల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.