రాంనగర్, జూన్ 3: కరీంనగర్ లోక్సభ ఓట్ల లెక్కింపు సందర్భంగా పకడ్బందీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ అభిషేక్ మొహంతి తెలిపారు. ఇద్దరు అడిషనల్ డీసీపీ స్థాయి అధికారులు, 11 మంది ఏసీపీలు, 16 మంది ఇన్స్పెక్టర్లు, 39 మంది ఎస్ఐలు, 46 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 220 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 125 మంది హోంగార్డులతోపాటు 8 స్పెషల్ యాక్షన్ టీంలు, 3 ప్లాటూన్ల స్పెషల్ పోలీసులను, టాస్ ఫోర్స్ టీంలను కేటాయించినట్లు వివరించారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రతా పరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచే 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎక్కడా ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండవద్దని సూచించారు. సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ ఒక ప్రకటనలో తెలిపారు.