Endowment | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : దేవాదాయశాఖలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఉద్యోగులు, అర్చకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దేవాలయాల్లో ఆగమాలకు విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలతో అర్చకులు ఆందోళన చెందుతున్నారు. తమ హక్కులను హరిస్తున్నారంటూ కోర్టును ఆశ్రయిస్తున్నారు. వాస్తవానికి దేవాలయాల్లో రాజకీయ జోక్యం ముందు నుంచీ ఉన్నది. కానీ, ఇటీవల కక్షసాధింపు చర్యలకు ఆలయాలు వేదికలయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అర్చకులు, ఉద్యోగులకు సంబంధించి ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు, వారు ఇస్తున్న ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి.
అర్చకుల విషయంలోనే కాకుండా, తమ విషయంలోనూ అదే పంథా అనుసరిస్తున్నారంటూ ఉద్యోగులు, సిబ్బంది మండిపడుతున్నారు. బల్కంపేట ఆలయంలో కొందరు ఉద్యోగులను సస్పెండ్ చేసి, మరికొందరిని డిప్యుటేషన్‌పై వేరే దేవాలయానికి పంపించిన వ్యవహారం ప్రస్తుతం పెద్ద దుమారం రేపుతున్నది. మంత్రి కొండా సురేఖ ఇటీవల బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి.. ఈవో, సూపరింటెండెంట్లను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేయగా కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత కొందరు ఉద్యోగులను బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ మహంకాళి, గణేశ్ దేవాలయాలకు సంబంధించిన సిబ్బందిని పరస్పరం డిప్యుటేషన్లపై పంపిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, ఈవోలు మాత్రం అందుకు తగినట్టు స్పందించకుండా కొందరు ఉద్యోగులను తమ ఆలయాల నుంచి రిలీవ్ చేయడం లేదని తెలుస్తున్నది. గణేశ్ ఆలయం నుంచి ఐదుగురిని డిప్యుటేషన్‌పై పంపించగా, అందులో ఇద్దరిని మాత్రమే ఈవో రిలీవ్ చేసి మిగతావారిని ఇప్పటికీ రిలీవ్ చేయకపోవడంపై దేవాదాయశాఖలో చర్చ జరుగుతున్నది. కొండగట్టులో ఈవోగా పనిచేసిన శ్రీకాంతరావు డిప్యూటీ కమిషనర్ హోదా కలిగి ఉండగా, ఆయనను అసిస్టెంట్ కమిషనర్ హోదాలో మన్నెంకొండకు బదిలీ చేశారు.
దీంతో ఆయన కోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చింది. మరోవైపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పాలకుర్తి, కురవి దేవాలయాల్లో వీఐపీలకు సరైన మర్యాద చేయలేదంటూ ఆయా దేవాలయాల ఈవోలను వివరణ కోరుతూ ఏడీసీ శ్రీనివాసరావు మెమోలు ఇచ్చారు. వీఐపీలకు మర్యాదల్లో లోపం లేదని, వచ్చేవారిలో వీఐపీలు ఎవరో తెలియని పరిస్థితిలో దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఉన్నారంటూ ఆ శాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రులు సిఫార్సు చేస్తే చాలు.. ఎలాంటి హోదా లేకున్నా వారిని వీఐపీలుగా ప్రొటోకాల్ కల్పించాలని చెప్పడం, శివరాత్రి వంటి పర్వదినాల్లో చిన్నచిన్న లోపాలతోనూ ఉద్యోగులను మెమోల పేరిట వేధించడం సరికాదంటూ దేవాదాయ అర్చకులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇక ఇతర శాఖల నుంచి తమ శాఖలోకి ఉద్యోగులను తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ దేవాదాయశాఖ ఉద్యోగులంతా పెన్‌డౌన్‌కు సిద్ధపడిన సంగతి తెలిసిందే. దీంతో వారికి ఉత్తర్వులు ఇచ్చినా, ఇప్పటివరకు ఆ ఇద్దరు పంచాయతీరాజ్ ఉద్యోగులను దేవాదాయశాఖలోకి తీసుకోలేదు. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలో మూడుజిల్లాలకు సంబంధించిన అర్హత కలిగిన ఉద్యోగులకు ప్రమోషన్ ఇస్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పినా ఆ ఆర్డర్లు తయారు చేసినప్పటికీ తనకు కావలసింది అందకుండా ఎవరి చేతికి ఇవ్వొద్దంటూ ప్రధాన కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి ఈ ఉత్తర్వులకు అడ్డుపడుతున్నారనే చర్చ జరుగుతున్నది.
ఆలయ ఆగమాలకు విరుద్ధంగా ఒక ఆలయంలో పనిచేయాల్సిన అర్చకుడిని మరో ఆలయంలో, సంబంధం లేనిచోట పనిచేయాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం గందరోగళానికి దారి తీస్తున్నది. ఈ నిర్ణయం వెనుక రాజకీయ నాయకుల జోక్యం మితిమీరిపోతున్నదని అర్చక ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గత పదిహేను రోజుల్లో ప్రధాన ఆలయాలైన జోగుళాంబ, కొండగట్టు, బల్కంపేట తదితర చోట్ల ఆగమాలకు విరుద్ధంగా ఇచ్చిన ఉత్తర్వులు వివాదస్పదమయ్యాయి. జోగుళాంబ దేవాలయంలో ఇద్దరు అర్చకులు తమ సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవడం లేదని, ప్రధాన దేవాలయంలో నిత్యపూజలు, ఉత్సవాల వంటి ముఖ్య విధులు ఇవ్వకుండా తక్కువ ప్రాధాన్యత కలిగిన బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ ఆ శాఖ ఉన్నతాధికారులపై హైకోర్టును ఆశ్రయించారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న అనిల్‌కుమార్.. తనను అకారణంగా ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి బదిలీ చేశారని, దేవాదాయ చట్టానికి విరుద్ధంగా తన బదిలీ జరిగిందని, రాజ్యాంగంలోని ఆర్టికల్-14 ప్రకారం తమ హక్కులకు భంగం కలిగిందని కోర్టును ఆశ్రయించారు. అర్చకులకు ఊరట కలిగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా, ఆలయాల్లో రాజకీయ జోక్యం కారణంగానే తమకు నష్టం జరుగుతున్నదని అర్చకులు వాపోతున్నారు. శాస్త్ర విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారాలపై దేవాదాయశాఖ కమిషనర్ దృష్టి సారించాలని బాధితులు కోరుతున్నారు.