జగిత్యాల, ఫిబ్రవరి 20 : సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంచకుండా, సాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతున్నదని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మండిపడ్డారు. కేసీఆర్ మీద కోపం రైతులపై చూపవద్దని, దయచేసి ఎరువులు, నీళ్లు అందించి ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. జగిత్యాలలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ హయాంలో సకాలంలో విత్తనాలు, ఎరువులు, నీళ్లు, కరంట్ అందజేశామని గుర్తు చేశారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తె గోస పడుతామని గతంలో జగిత్యాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమావేశంలో కేసీఆర్ చెప్పారని, ఇప్పుడు రుణమాఫీ కాక, రైతు భరోసా అందక, పంటలు ఎండిపోయి రైతులు నరకం అనుభవిస్తున్న ఘటనలు ఉమ్మడి సారంగాపూర్ మండలంలో ప్రత్యక్షంగా చూస్తున్నామని తెలిపారు.
జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి, తాటిపెల్లిలో తూములు ధ్వంసమై నీళ్లు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయంపై రాష్ట్రంలోగానీ, జిల్లాలోగానీ ఇంత వరకు ఒక సమీక్ష జరిగిన పాపాన పోలేదని, యూరియా నిల్వలు లేవని, పీఏసీఎస్ సంఘం యూరియా కోసం డబ్బులు కట్టినా మార్ఫెడ్ ద్వారా ఇప్పటి వరకు బస్తాలు రావడం లేదన్నారు. మార్పు అంటే ఇదేనా..? అని ఎద్దేవా చేశారు. రైతులు ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్‌కు చీమ కుట్టినట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. ఈ పద్ధతి ప్రభుత్వానికి ఎంతమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జగిత్యాల పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనందరావు, సింగిల్ విండో చైర్మన్లు మహిపాల్‌రెడ్డి, సందీప్ రావు, గంగారెడ్డి, కల్లూరి హరీశ్, ఆదిరెడ్డి, కమలాకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.