జగిత్యాల రూరల్, జనవరి 16 : పసుపు బోర్డు ఏర్పాటుకు ముఖ్య కారణం ఆనాటి ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత సుదీర్ఘ పోరాటమేనని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ స్పష్టం చేశారు. జగిత్యాల రూరల్ మండలంలోని వెల్దుర్తి గ్రామంలోని పసుపు క్షేత్రంలో గురువారం రైతులతో కలిసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కవిత చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంత పసుపు రైతుల సుదీర్ఘ కాల పోరాటంలో భాగంగా ఆనాటి ఎంపీ కవిత నాయకత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేక సార్లు సంబంధిత కేంద్ర మంత్రులను కలిశారని, పార్లమెంట్లో కవిత గళమెత్తడం వంటి పోరాటాల ఫలితంగా పసుపు బోర్డు ఏర్పాటు కల ఫలించిందన్నారు. పసుపు పండించే రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కేంద్రానికి పసుపు బోర్డు ఏర్పాటు కోసం లేఖలు ఇప్పించడం కోసం ఆమె చేసిన కృషిని గుర్తు చేశారు.
పసుపు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి, కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.15 వేలు ఉండేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ స్థాయిలో పసుపునకు గుర్తింపు వచ్చేలా జీఐ ట్యాగింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ మాజీ చైర్మన్ సదాశివరావు, బీఆర్ఎస్ రూరల్ మండలాధ్యక్షుడు ఆనందరావు, మాజీ సర్పంచ్ ప్రవీణ్, నాయకులు రాంరెడ్డి, శేఖర్, రామకిషన్, గంగారెడ్డి, మహేష్, హరీష్, రామస్వామి, లక్ష్మణ్, మాలయ్య, లక్ష్మీరాజం పాల్గొన్నారు.