వీణవంక/శంకరపట్నం/కరీంనగర్‌రూరల్/ సైదాపూర్/ కాల్వశ్రీరాంపూర్, మార్చి 18: పంటలు చేతికొచ్చే సమయంలో అకాల వర్షం విరుచుకుపడింది. రైతన్నకు మరోసారి అపార నష్టాన్ని తెచ్చి పెట్టింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం అకాల వర్షం పడింది. వీణవంక మండలంలో 50 మంది రైతులకు చెందిన 260 ఎకరాల్లో మక్క నేలకొరిగింది. ఎకరాకు 50వేల పెట్టుబడి పెట్టి మునిగామని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటనష్టాన్ని అంచనా వేసి, న్యాయం చేయాలని రైతులు కోరారు.
జమ్మికుంట-కరీంనగర్ ప్రధాన రహదారి పక్కన నర్సింగాపూర్‌లో డ్రైనేజీ నిర్మించక పోవడంతో రోడ్డు పక్కన ఉన్న ఇళ్లలోకి వరద చేరి ప్రజలు ఇబ్బంది పడ్డారు. శంకరపట్నం మండలం రాజాపూర్‌లో చింతిరెడ్డి ఆదిరెడ్డి ఇంటి సమీపంలో కొబ్బరి చెట్టుపై భారీ పిడుగు పడి, దగ్ధమైంది. కరీంనగర్ రూరల్ మండలం తాహెర్ కొండాపూర్‌లో కౌలు రైతు పూరెళ్ల లక్ష్మయ్య ఐదెకరాలలో, మరో రైతు బోనాల రాజు ఆరెకరాలలో వేసిన మక్క నేలకొరిగింది.
మండలంలో మొత్తం 20 ఎకరాలలో మక్కకు నష్టం వాటిల్లిందని, ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందని కరీంనగర్ మండల వ్యవసాయ అధికారి సత్యం తెలిపారు. సైదాపూర్ మండలం రాయికల్‌లో వరి పంట దెబ్బతిన్నది. కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం, వెన్నంపల్లి, గంగారం, మంగపేట గ్రామాల్లో సుమారు 500 ఎకరాల మక్క పంట నేలకొరగగా, రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిహారం అందించాలని కోరుతున్నారు. నేలవాలిన పంటలను ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్ పరిశీలించారు. కాగా, కూనారంలో ఉగ్గె రమేశ్‌కు చెందిన బర్రె పిడుగుపాటుతో మృతిచెందింది.