కరీంనగర్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): దళిత బంధు పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి అధికారులకు అందించారు. మంత్రి గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 95 మందిని ఎంపిక చేశారు. మరో ఐదుగురిని ఎంపిక చేయాల్సి ఉండగా, మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దళితుల జనాభా తక్కువగా ఉన్న గ్రామాలను సెలెక్ట్ చేసుకున్నారు. చొప్పదండి నియోజకవర్గంలో కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్న మూడు మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేశారు. చొప్పదండి మండలం కోనేరుపల్లిలో 24, గంగాధర మండలంలోని కొండన్నపల్లిలో 12, రామడుగు మండలం పందికుంటపల్లిలో 13 మంది చొప్పున 49 మందిని ఎంపిక చేశారు. ఇక మానకొండూర్ నియోజకవర్గంలోని గన్నేరువరం మండలం పీచుపల్లిలో 13, మానకొండూర్ మండలం బంజేరుపల్లిలో 22, శంకరపట్నం మండలం ఇప్పలపల్లిలో 10, తిమ్మాపూర్ మండలం రామహన్మాన్నగర్లో 13 మంది చొప్పున 50 మందిని ఎంపిక చేశారు.
రాష్ట్రంలో హుజూరాబాద్‌ను ఏ విధంగానైతే పైలట్ నియోజకవర్గంగా ఎంపిక చేసి అమలు చేస్తున్నారో.. ఇప్పుడు మిగతా నియోజకవర్గాల్లోని ఒక్కో మండలంలో ఒక్కో గ్రామాన్ని కూడా పైలట్‌గా ఎంపిక చేశారు. అందులో భాగంగానే ఎమ్మెల్యేలు దళితుల జనాభా తక్కువగా ఉన్న గ్రామాలను సెలెక్ట్ చేసి, అక్క లబ్ధిదారులందరినీ ఎంపిక చేసుకునే ప్రయత్నం చేశారు. లబ్ధిదారుల ఎంపిక, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మొదలుకుని ఎలాంటి యూనిట్లు అయితే బాగుంటుందనే విషయాలపై అధికారులు ఆయా గ్రామాల్లో కసరత్తు చేస్తున్నారు. హుజూరాబాద్‌లో పని చేసిన అధికారులు కొందరు ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సారి బడ్జెట్లో దళితబంధుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన నేపథ్యంలో త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి నిధులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. పైలట్ ప్రాజెక్టుగా మాత్రం తక్కువ జనాభా ఉన్న గ్రామాలను ఎంపిక చేసి, ఆయా గ్రాయాల్లో దళితులందరినీ లబ్ధిదారులుగా ఎంపిక చేసేందుకే ఎమ్మెల్యేలు చొరవ చూపారు. చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాలు ఇతర జిల్లాల పరిధిలో కూడా ఉన్నందున.. ఆయా జిల్లాల్లోని మండలాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ఇదే విధంగా దళితులు తక్కువగా ఉన్న గ్రామాలనే ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తున్నది.
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు దళితబంధు లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్ తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మాదిరిగానే ప్రతి లబ్ధిదారుకు పథకంపై అవగాహన కల్పిస్తున్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఎలాంటి యూనిట్లు ఎంపిక చేసుకోవాలి? లబ్ధిదారులకు అనుభవమున్న యూనిట్లను ఏ విధంగా నెలకొల్పుకోవాలనే విషయాలపై సంబంధిత శాఖల అధికారులు శిక్షణ ఇవ్వనున్నారు. హుజూరాబాద్‌లో చాలా మంది లబ్ధిదారులు ఒకే విధంగా యూనిట్లు ఎంపిక చేసుకుంటున్న నేపథ్యంలో పని లభించని పరిస్థితి ఏర్పడుతుందని గ్రహించిన అధికారులు వారికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. దీంతో ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ ఉన్న యూనిట్లపై లబ్ధిదారులు దృష్టి సారిస్తున్నారు. గ్రూపులు ఏర్పాటు చేసి ఒకే యూనిట్‌ను నలుగురైదుగురికి అందిస్తున్నారు. ఈ విధానం మంచి ఫలితాలను ఇస్తుండగా, జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లోనూ ఇదే పద్ధతిలో యూనిట్ల ఎంపిక ప్రక్రియ చేపట్టేందుకు లబ్ధిదారులకు అవగాహన కల్పించడం, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేపడుతున్నారు.
దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. హుజూరాబాద్‌లో ఇప్పటికే 2,006 మందికి 1,707 యూనిట్లు అందించాం. అందులో 199 గ్రూపులు ఏర్పాటు చేసి 499 మందికి ఇచ్చాం. ఇదే విధంగా జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో కూడా దళితబంధు లబ్ధిదారుల లిస్ట్‌ను మంత్రి గంగుల కమలాకర్‌తోపాటు ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్ ఇచ్చారు. మొత్తం 207 మంది లబ్ధిదారుల జాబితాను ఆమోదం కోసం కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌కు పంపించాం. త్వరలోనే వీరికి అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఆ తర్వాత గ్రౌండింగ్ ప్రక్రియ చేపడుతాం. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన గ్రామాలకు అధికారులకు పైలట్‌గా ఉపయోగపడతాయి..
– సురేశ్, కరీంనగర్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ