Right to Education Act | ధర్మారం, జూలై 24: ప్రైవేటు విద్యాసంస్థలలో విద్యా హక్కు చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడానికి కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కు స్థానిక దళిత సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చైర్మన్ వెంకటయ్య గురువారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి రాగా ఆయనకు స్థానిక గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్లో దళిత సంఘాల నాయకులు వినతిపత్రం సమర్పించారు.
ప్రైవేటు విద్యా సంస్థలలో విద్యా హక్కు చట్టం ప్రకారం నిరుపేద విద్యార్థులకు వందకు 25 శాతం ఉచిత విద్య, బెస్ట్ అవలేబుల్ స్కూల్ విద్యార్థులకు పీజులు అందించాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించి పరిశీలిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కుశనపల్లి రవి, మాల సంఘం జేఏసీ జిల్లా అధ్యక్షుడు దేవి రాజలింగయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బొల్లి నందయ్య, సుంచు మల్లేశం, దివ్యాంగుల హక్కుల దండోరా మండల అధ్యక్షుడు గుమ్మడి రమేష్, ఎన్ హెచ్ డి జిల్లా అధ్యక్షుడు గజ్జెల రాజేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.